
దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు 2024 ఏడాది మొదటిరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 వరకు నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 21,710 వద్దకు, సెన్సెక్స్ 126 పాయింట్లు నష్టపోయి 72,113 వద్దకు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చాలా ఆసియా మార్కెట్లు సోమవారం సెలవు ప్రకటించాయి. దాంతో లోట్రేడింగ్ వాల్యూమ్‌లు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నట్లు తెలిసింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను విడుదల చేయనున్నారు. దాంతో మార్కెట్‌లో కొంత అనిశ్చితులు నెలకొంటాయనే భావనతో మదుపరులు కొంత జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు జనవరిలో అన్ని కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో షేర్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని సమాచారం.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.1,459 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీల నుంచి రూ. 554.39 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్ 2023లో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో దాదాపు రూ.66,135 కోట్ల పెట్టుబడి పెట్టారు. మొత్తం 2023 సంవత్సరంలో రూ.1,71,107 విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు లాభపడి 83.16 వద్దకు చేరింది.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, మారుతి సుజుకీ, టాటా మోటార్స్, టైటాన్, ఎన్‌టీపీసీ, నెస్లే, ఎల్ అండ్ టీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. యాక్సిస్‌బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, భారతి ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)