Artisans Of Banjara: పల్లె పట్నం, పండితుడు పామరుడు ఇలా ఎటువంటి తేడాలు లేకుండా అందర్నీ కలిపేస్తోంది ఇంటర్నెట్. ముఖ్యంగా ఎంతో మంది కళాకారులకు సోషల్ మీడియా ద్వారానే గుర్తింపు వచ్చింది. అనేక స్టార్టప్‌లు కూడా కేవలం సోషల్ మీడియా ఆధారంగానే పురుడుపోసుకున్నాయి. ఆ కోవకే చెందిన మరో స్టార్టప్ ఆర్టిసన్స్ ఆఫ్ బంజారా. 25 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ విద్యార్థి యాక్సిడెంటల్‌గా స్థాపించిన ఈ స్టార్టప్ ఇప్పుడు వందల మందికి జీవనోపాధిని కల్పిస్తోంది.
న్యూఢిల్లీకి చెందిన సృష్టి తేహ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఏకో ట్రావెలర్‌గా నిత్యం ప్రయాణాలు చేయడం తన హాబీ. అయితే కోవిడ్ సంక్షోభం కారణంగా లాక్‌డౌన్ విధించడంతో పనులన్నీ పక్కన పెట్టి ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. మొదటిసారి లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తి వేసిన తర్వాత ఇంట్లోకి అద్దం కొనేందుకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని గురుగ్రామ్ సెక్టార్ 56లో ఉన్న బంజారా మార్కెట్‌కి వెళ్లింది. ఎప్పుటి నుంచో ఢిల్లీలో ఉంటున్నా మొదటిసారి అక్కడికి వెళ్లింది.
బోణి చేయండమ్మ
బంజారా మార్కెట్‌లో అద్దం కోసం సృష్టి తిరుగుతుంటే ఓ మహిళ చంకలో చంటి బిడ్డతో వచ్చి ‘బోణి చేయండమ్మా.. బిడ్ద ఆకలికి ఏడుస్తోంది’ అంటూ తన చేతిలో ఉన్న టీ కప్పులు కొనమంటూ ప్రాధేయపడింది. టీ కప్పులు కొంటుండగానే మళ్లీ ఆ మహిళే మాట్లాడుతూ ‘లాక్‌డౌన్ కారణంగా మా వ్యాపారం మొత్తం ఆగిపోయింది. ఎవ్వరూ మార్కెట్‌కి రావడం లేదు. పెద్ద వాళ్లమంతా రోజుల తరబడి పస్తులే ఉంటున్నాం. పిల్లలకు తిండి పెట్టడం కూడా కష్టంగా మారింది’ అంటూ తన పరిస్థితి వివరించింది.
ముచ్చట గొలిపే వస్తువులు
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌కి చెందిన సంచార జాతుల వారు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన మార్కెట్ అది. కాలక్రమేనా బంజారా మార్కెట్‌గా పేరు పడిపోయింది. హస్త కళలతో వారు రూపొందించిన మట్టి పాత్రలు మొదలు టీకప్స్, రగ్గులు, దుప్పట్లు ఒక్కటేమిటి ఇంటి అలంకరణకు సంబంధించిన సమస్త వస్తువులు అక్కడ లభిస్తాయి. అయితే వాటిని అమ్ముకోలేక తిండికి సైతం తిప్పలు పడుతుండటం చూసి సృష్టి చలించిపోయింది. అదే సమయంలో అక్కడి వస్తువుల్లోని కళాత్మక ఆమెను కట్టి పడేసింది. ఆ వస్తువులకు సరైన మార్కెటింగ్ చేస్తే.. సీన్ వేరేలా ఉంటుందని ఆమెని ఫ్యాషన్ డిజైనర్ ఇట్టే పసిగట్టింది.
ఇన్‌స్టా స్టోరీతో
మరోసారి బంజార్ మార్కెట్‌కి వెళ్లిన సృష్టి.. అక్కడ తనకు నచ్చిన వస్తువుల ఫోటోలు తీసుకుంది. వాటిని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టా ఫాలోవర్సు బాగున్నాయంటూ స్పందించారు. ఈసారి గ్రాఫిక్స్ సాయంతో వాటిని చక్కగా డిజైన్ చేసి ఆర్టిసన్స్ ఆఫ్ బంజారా పేరుతో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది... ఫర్ సేల్ అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడు అమ్ముతారో చెబితే కొంటామనే వారు ఎక్కువయ్యారు. దీంతో మొదటి సారి టైం డేట్ చెబుతూ ఫ్లాష్ సేల్ ప్రకటించింది. అయితే అప్పటికే ఆమె చేతిలో ఒక్క వస్తువు కూడా లేదు.
రూ. 2000లతో మొదలు
ఫ్లాష్ సేల్ ఇలా ప్రారంభమైందో లేదో కేవలం పది నిమిషాల్లో 791 వస్తువులకు ఆర్డర్లు వచ్చాయి. ఇందులో ఢిల్లీ నుంచే కాదు తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వెంటనే తల్లి దగ్గర నుంచి రూ. 2000 తీసుకుని వాటితో ప్యాకింగ్ వస్తువులు కొనుగోలు చేసింది. ఆర్డర్లకు తగ్గట్టుగా వాటిని ప్యాక్ చేసి పంపింది. ఈ పని పూర్తి కాకముందే రెండో ఫ్లాష్ సేల్ ఎప్పుడంటూ ఎంక్వైరీ మొదలైంది.
ఓపికగా
ఫస్ట్ ఫ్లాష్ సేల్‌కి సంబంధించి కోరియర్ చేసిన వస్తువుల్లో సగానికి సగం డ్యామేజ్ అయి కస్టమర్లకు చేరుకున్నాయి. మరికొన్ని చెప్పిన సమయం కంటే ఆలస్యంగా గమ్యస్థానం చేరాయి. ఓ వైపు కస్టమర్ల నుంచి ఒత్తిడి మరోవైపు కొంతైన డబ్బులు ఇస్తూ ఇంటిల్లిపాదికి భోజనం దొరుకుతుందన్నట్టుగా చూస్తున్న బంజారాలు. ఓపికగా కష్టమర్లకు తిరిగి వస్తువులు పంపిస్తూ వారి మన్ననలు పొందింది. అలా తొలి వారమే రూ. 75,000 వస్తువులు అమ్ముడయ్యాయి. వస్తువుల క్వాలిటీ గురించి ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.
ప్రొఫెషనల్‌గా
ఇన్‌స్టాలో సేల్స్‌కి ఆదరణ ఉండటం కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ బాగుండటంతో ఆర్టిసన్స్ ఆఫ్ బంజారా పేరుతో ప్రత్యేకంగా ఈ కామర్స్ పోర్టల్‌ని ప్రారంభించారు. బంజారాలు తయారు చేస్తున్న వందల రకాల వస్తువులను ఈ పోర్టల్‌లో అమ్మకానికి పెట్టారు. ఏడాది కాలంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ కామర్స్ పోర్టల్ రన్ అవుతోంది. దీంతో ఇటీవల ఆర్టిసన్స్ ఆఫ్ అస్సామ్‌ని సైతం అమ్మకానికి సిద్ధంగా ఉంచారు.
బతుకులు మారాయి
బంజారా మార్కెట్‌లో ఉన్నప్పుడు రోజంతా కష్టం చేస్తే రూ.500లు వచ్చేవి. వాటితో మా ఇంట్లో ఐదుగురం కడుపు నిండా అన్నం తినేవాళ్లం. కానీ లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వ్యాపారం ఆగిపోయింది. తిండి కోసం దాతల ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ బాధలు లేవని, తమ కళకు తగ్గ గుర్తింపుతో పాటు ఆదాయం కూడా వస్తోందని బంజారాలు అంటున్నారు.
ఇప్పుడిదే ఆధారం
ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసిన బంజారా మార్కెట్‌ను ఇటీవల హర్యాణా అధికారులు జేసీబీలతో తొలగించారు. దీంతో అనేక మంది బతుకులు రోడ్డున పడ్డాయి. తమకు న్యాయం చేయండంటూ వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వారికి సర్కాను నుంచి అండ ఎప్పుడు లభిస్తోందో తెలియదు. కానీ వారి కళకు గుర్తింపు ఇస్తూ ఆపద సమయంలో అండగా ఉంటూ..ఆ కళాకారుల కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్తితి రాకుండా కాపాడుతోంది ఆర్టిసన్స్ ఆఫ్ బంజారా.
- సాక్షి, వెబ్‌ప్రత్యేకం
Comments
Please login to add a commentAdd a comment