ఐటీ జాబ్‌ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త | Tech Job Openings In US Indicates A Positive Trend | Sakshi
Sakshi News home page

జోరందుకోబోతున్న నియామకాలు.. యూఎస్‌ డేటా విడుదల

Published Fri, Apr 12 2024 10:43 AM | Last Updated on Fri, Apr 12 2024 11:49 AM

Tech Job Openings In US Indicates A Positive Trend - Sakshi

కాస్ట్‌కటింగ్‌ పేరిట, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో గత కొంతకాలంగా ఐటీ కంపెనీలు ఆశించినమేర నియామకాలు చేపట్టలేదు. అయితే క్రమంగా ఈ పరిస్థితులు మారుతున్నాయని యూఎస్‌లోని కంప్యూటింగ్‌ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్‌ డేటా ద్వారా తెలుస్తుంది. ఇకపై యూఎస్‌లో టెక్ కంపెనీల నియామకాలు పుంజుకోనున్నాయని ఈ డేటా నివేదించింది.

సమీప భవిష్యత్తులో ఐటీ కంపెనీలకు ప్రాజెక్ట్‌ల సంఖ్య పెరుగబోతున్నట్లు డేటా విశ్లేషించింది. అమెరికాలో కార్యాకలాపాలు సాగిస్తున్న భారత టెక్‌ కంపెనీలకు ఇది శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు. ఆయా కంపెనీల్లో త్వరలో నియామకాలు ఊపందుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని టెక్ కంపెనీలు గత నెలలో 6,000 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకున్నాయని డేటా ద్వారా తెలిసింది. యూఎస్‌లోని భారత కంపెనీల్లో ప్రధానంగా టీసీఎస్‌లో 50,000 మంది, ఇన్ఫోసిస్‌లో 35,000, హెచ్‌సీఎల్‌ టెక్‌లో 24,000, విప్రోలో 20,000, ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ట్రీలో 6,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. త్వరలో ఈ సంఖ్య మరింత పెరుగబోతున్నట్లు తెలిసింది. 

ఐటీ కంపెనీల్లో ‍ప్రధానంగా సాంకేతిక సేవలు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగాల్లో భారీ నియామకాలు ఉండబోతాయని సమాచారం. యూఎస్‌లో వివిధ పోజిషన్‌ల్లో పనిచేయడానికి మార్చిలో తమకు దాదాపు 1,91,000 కొత్త టెక్‌ ఉద్యోగులు అవసరమని కంపెనీలు పోస్ట్‌ చేశాయి. అంతకుముందు నెల కంటే ఈ సంఖ్య 8,000 అధికంగా ఉండడం గమనార్హం. మొత్తంగా మార్చిలో 4,38,000 యాక్టివ్ టెక్ జాబ్స్‌ ఉన్నాయని అంచనా. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్‌ల నియామకాల్లో ఫిబ్రవరి-మార్చి మధ్య కాలంలో పెరుగుదల కనిపించింది. న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, చికాగో, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీలు మార్చిలో అత్యధిక నియామకాలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది.

ఇదీ చదవండి: పాతబడేకొద్దీ మరింత ప్రమాదం

యూఎస్‌లోని భారత కంపెనీల ఉద్యోగులకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఆసక్తికర నివేదిక వెల్లడించింది. దాని ప్రకారం.. యుఎస్ టెక్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మొత్తం శ్రామికశక్తిలో భారత కంపెనీలు 2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2023లో యుఎస్‌లో టెక్ ఉద్యోగుల ఉపాధి 1.2% పెరిగింది. 2023 వరకు టెక్‌ కంపెనీలు దాదాపు 5 లక్షల ఉద్యోగులను తొలగించాయని అంచనా. అప్పటి నుంచి తొలగింపుల పర్వం కాస్త నెమ్మదించిందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం కంపనీలు నియామకాల ప్రక్రియ ప్రారంభించడంతో ఉద్యోగులకు డిమాండ్ ఏర్పడి కంపెనీల రాబడి సైతం పెరుగబోతుందని తెలిసింది. రాబోయే క్యూ4 ఫలితాల్లో కంపెనీలు మెరుగైన ఫలితాలు పోస్ట్‌ చేస్తాయని, ఇక నుంచి కంపెనీల్లో వృద్ధి కనిపిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement