Tesla Shares Dip: ఒక్క పెట్టున మిలియన్ డాలర్లు సంపాదించాలన్నా.. నిమిషాల్లో అంతే సంపదను ముంచేయాలన్నా అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కి చిటికేసినంత పని. గతంలో ‘ట్వీట్ల’ ద్వారానే అలాంటి పనులు చేశాడాయన. అలాంటిది తన చేష్టలతో ఈసారి టెస్లా కొంపముంచుతున్నాడు. ఈవీ దిగ్గజం టెస్లా షేర్లు ప్రస్తుతం అమెరికన్ మార్కెట్‌లో పతనం దిశగా దూసుకుపోతున్నాయి.
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేష్టల తర్వాతే ఈ పతనం మొదలుకావడం విశేషం. సుమారు 5 బిలియన్‌డాలర్ల విలువైన తన పది శాతం వాటా ఎలన్ మస్క్ అమ్మేసుకున్న విషయం తెలిసిందే. ఈ మరుక్షణం నుంచే షేర్ల విలువలు పడిపోతూ వస్తున్నాయి. స్టాక్ మార్కెట్‌లో 0.4 శాతం పడిపోయిన టెస్లా షేర్ విలువలు.. ఈ వారం 1,063.51 డాలర్ల వద్ద ముగిసింది. ఇక వారం మొత్తంగా 157 బిలియన్‌డాలర్ల విలువైన పతనం చవిచూసింది టెస్లా. ఇక ఈ పతనం ఇంకొంత కాలం కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
స్పేస్‌ఎక్స్ పదిలం
ఎలన్ మాస్క్ మొత్తం సంపదలో టెస్లా వాటా ద్వారా ఉన్న విలువే ఎక్కువ!. 2016 తర్వాత తాజాగా తన షేర్లను అమ్మేసుకున్న ఎలన్ మస్క్.. అదీ ట్విటర్ పోల్ అభిప్రాయం ద్వారా ముందుకు వెళ్లడం కొసమెరుపు. ఇక సొంత కంపెనీ స్పేస్‌ఎక్స్ షేర్లను మాత్రం భద్రంగా చూసుకుంటున్నాడు. అయితే ఈవీ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నప్పటికీ.. మార్కెట్ పతన ప్రభావం మాత్రం టెస్లాపై కొనసాగుతోంది. అయితే ఈ ప్రతికూల ప్రభావం సుదీర్ఘ కాలం ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం మస్క్‌ను చూసి ఇన్వెస్టర్లు టెస్లాలో ఇన్వెస్ట్ చేయడం లేదని టెస్లా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.
ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘సోషల్ స్పెండింగ్ ప్లాన్’ కోసం సెనేటర్లు ఒక ప్రతిపాదన చేశారు. దీని ప్రకారం.. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేయొచ్చు. దీంతో పన్నుల భారం తగ్గించుకునేందుకే ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment