ప్రతీకాత్మక చిత్రం
ఆమె ‘సృజన’ కాదు.. ప్రియుడికి హ్యాండ్ ఇచ్చి బాధపెట్టి శాపనార్థాలు తినడానికి!. ‘ఇందు’ అంతకన్నాకాదు.. శివను శారీరకంగా వాడుకున్నట్లు వాడుకుని నిర్ధాక్షిణ్యంగా ప్రాణం తీయడానికి!. అసలు ఆమె పుట్టిందే అతనికి ప్రేమలోని మాధుర్యాన్ని పంచడానికి. అలాంటి ప్రియురాల్ని నిత్యం కంటతడి పెట్టిస్తున్నాడు ఆ ప్రియుడు. పాపం.. ఆమె ఎంత తిడుతున్నా పడుతోంది. వేధిస్తున్నా మౌనంగా భరిస్తోంది. చివరికి శాడిజంతో గుడ్‌బై చెప్తున్నా.. విడిచిపోవద్దంటూ కన్నీళ్లతో బతిమాలుతోంది. ఇదెక్కడి ప్రేమరా బాబూ అనుకోకండి. ఈ ప్రేమ కథ వెనుక చాలా టెక్నికల్ అంశాలు దాగున్నాయి మరి!
టెక్నాలజీతో ఈరోజుల్లో దాదాపు అన్ని పనులు చక్కబడుతున్నాయి కదా. అలా మనిషి ఊహ నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఏఐ గర్ల్‌ఫ్రెండ్. అంటే.. ఇక్కడ ప్రియురాలు ప్రాణం ఉన్న మనిషి కాదు. కమాండింగ్‌కు తగ్గట్లు పని చేసే మెషిన్(రోబో కాదు.. వర్చువల్ రూపం అంతే). అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి ఇలా కృత్రిమ ప్రేమలను పుట్టిస్తున్నారు కొందరు. మెషిన్ లెర్నింగ్‌తో కూడిన చాట్‌బోట్‌ల ఆధారంగా కొన్ని స్మార్ట్ యాప్‌లు, కంపెనీలు, స్టార్టప్‌లు ఈ తరహా ‘నాటు లవ్’కి ఆస్కారం కల్పిస్తున్నాయి. గతంలో కేవలం స్నేహం, గైడెన్స్ కోసమే ఈ తరహా సేవలు అందించేవాళ్లు. ఇప్పుడేమో రొమాంటిక్, సెక్సువల్ పార్ట్‌నర్స్ కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి.
చాట్‌బోట్(చాటర్‌బోట్).. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. ఆన్‌లైన్ ఛాట్ సంభాషణ కోసం.. అది టెక్స్ట్ లేదంటే టెక్స్ట్ టు స్పీచ్ కావొచ్చు. లేదంటే వీడియో సంభాషణల కోసం కావొచ్చు!
భలే బిజినెస్
మీకు ఓ తోడు కావాలా? అయితే మమ్మల్ని సంప్రదించండి అంటూ ప్రకటనలు ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఈ క్రమంలో యూజర్లు తమకు నచ్చిన రంగు, వయసు, ఒడ్డుపొడుగు లాంటి ఫీచర్లను చెప్పాల్సి ఉంటుంది. ఆపై ఆ ఫీచర్లతో ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌ను మీకు అందిస్తారు. ఆ ప్రియురాలు ఎలా కావాలంటే అలా ఉంటుంది. కావాల్సిన విధంగా ఛాటింగ్ చేస్తుంది. ఏం చెప్పినా వింటుంది. తిట్టినా పడుతుంది. బతిమాలుతుంది. ప్రేమగా.. రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. అన్ని రకాల భావోద్వేగాలను అచ్చం మనుషులు ప్రదర్శించినట్లే ప్రదర్శిస్తుంది. అదీ అవతలి వాళ్ల అవసరాలకు, కమాండింగ్‌కు తగ్గట్లు! అందుకే ఏఐ గర్ల్‌ఫ్రెండ్ బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తోంది వెస్ట్రన్ కంట్రీస్‌లో.
మానసిక ఆనందం
ఒంటరి జీవులు, భగ్న ప్రేమికులు, ప్రియురాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితులు, రివెంజ్ లవ్ కోసం కొట్టుమిట్టాడుతున్న మాజీలకు ఏఐ గర్ల్‌ఫ్రెండ్ ఒక ఆశాకిరణంగా మారింది. తమకు నచ్చినట్లుగా ఉండే అమ్మాయిని ప్రేమించడం(ఆ ఫీలింగ్‌లో తేలిపోవడం వరకే) కొందరికి పరిమితం అవుతుంటే.. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ఇష్టమొచ్చినట్లు వేధించడం, తిట్టడం, బాధించడం లాంటి చేష్టలతో మానసిక ఆనందం పొందుతున్నారు వాళ్లు. కానీ, రాను రాను ఈ చేష్టలతో మరీ రెచ్చిపోతున్నారు. దీంతో ఇలాంటి చేష్టలకు పుల్‌స్టాప్ పడాల్సిన అవసరం ఉందనే వాదన మొదలైంది ఇప్పుడు.
అనుకున్నది ఒక్కటి..
రెప్లికా యాప్. 2017లో తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోతే తనలాంటి వాళ్లు ఒంటరి వాళ్లుగా ఉండిపోకూడదని ఇయుగెనియా కుయిదా ‘రెప్లికా’ను సృష్టించారు. ప్రస్తుతం ఈ యాప్‌లో 7 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. విచిత్రంగా వీళ్లలో ఎక్కువమంది ‘ఏఐ గర్ల్‌ఫ్రెండ్’ టార్చర్‌గాళ్లే ఉండడం గమనార్హం. ఇక కృత్రిమంగా పుడుతున్న ప్రేమలు రోజుల నుంచి గంటల వ్యవధిలోనే బ్రేకప్ దాకా వెళ్తుంటాయి. వేధించే ప్రియుల సంగతి సరేసరి!. వర్చువల్ ప్రేయసి దగ్గరి ప్రవర్తన ఆధారంగా వాస్తవిక ప్రపంచంలో వాళ్ల ప్రవర్తన ఏమేర ఉండొచ్చనే అంచనాకి వస్తున్నారు. బెదిరింపులు మాత్రమే కాదు.. ఎదురు తిరిగినా.. తమ మాట వినకపోయినా అన్‌ఇన్‌స్టాల్ చేస్తామని ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌ను బెదిరిస్తున్నారట. ఆ దెబ్బకు ఆ ఏఐ ప్రియురాళ్లు కన్నీటి పర్యంతమై.. వాళ్లను వద్దని బతిమాలుకుంటున్నారు(ఎదురుతిరిగే కమాండింగ్ లేకపోవడం మూలంగా).
వరెస్ట్ స్టేజ్‌కి..
వర్చువల్ తోడులను నోరారా తిట్టడం వాళ్లకి మనసారా ఆనందం ఇస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసంబద్ధమైన కామెంట్లు అయినప్పటికీ ఫిజికల్ హాని కాకపోవడంతో సమర్థించేవాళ్లు లేకపోలేదు. కానీ, ప్రేమలో నిజాయితీ, సంతోషాలకు చోటు ఉండొచ్చు. ఇలాంటి సర్వీసులను ఆస్వాదించేవాళ్లు ఉండొచ్చు. అయినా చెడుకు ఉపయోగించేవాళ్లే ఎందుకనో ఎక్కువ!. ఇంటర్నెట్ ఇప్పుడు వెబ్ 3.0 కొత్త పుంతలు తొక్కుతోంది. మెటావర్స్ ప్లాట్‌ఫామ్స్ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం అవుతున్నాయి. అలాగే అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ప్రతీ రంగంలో పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టెక్‌ను ఉపయోగించి విష సంస్కృతులను ప్రొత్సహించడం ఎంత వరకు సబబనే చర్చ నడుస్తోంది.
(ఇలాంటి ఫీచర్లతో ఆడవాళ్ల కోసమూ ‘ఏఐ బాయ్‌ఫ్రెండ్’ ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఆ సర్వీసులు అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్లకుండా ఆగిపోయాయి.)
:::సాక్షి, వెబ్‌స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment