వియత్నాంలోని కాన్‌థో నగరంలో ఇటీవల వెలిసిన బంగారు భవనం అంతర్జాతీయంగా వార్తలకెక్కింది. కాన్‌థో నగరానికి చెందిన ఎంగ్యూయెన్ వాన్ ట్రుంగ్ అనే ఆసామి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించాడు. కొత్తతరహాలో ఇల్లు నిర్మించుకోవాలనుకున్నాడు.
ఇళ్ల నమూనాలు చూడటానికి దేశదేశాల్లో సంచరించాడు. ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డెకరేటర్లతో చర్చోప చర్చలు జరిపాక, ఇదివరకు ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో బంగారు తాపడంతో ఇల్లు నిర్మించాలని నిశ్చయించుకుని, తన నివాసంగా బంగారు భవనాన్ని నిర్మించాడు.
ఇంటి వెలుపల గోడలను, పైకప్పును పూర్తిగా బంగారు రేకులతో తాపడం చేయించాడు. ఇంటి బయటే కాదు, లోపల కూడా అడుగడుగునా కళ్లుచెదిరేలా బంగారు వస్తువులతో నింపేశాడు. ఇంట్లోని చాలా వస్తువులు పూర్తి బంగారంతో తయారు చేయించనవి అయితే, కొన్ని భారీ విగ్రహాల వంటివి మాత్రం బంగారు తాపడం చేయించనవి.
ఆరేళ్ల కిందటే బంగారు భవనాన్ని నిర్మించాలని అనుకున్నానని, దీని నిర్మాణం పూర్తి చేయడానికి మూడేళ్లు పట్టిందని ట్రుంగ్ మీడియాకు వెల్లడించాడు. ఇప్పుడు ఈ భవంతి వియత్నాం దేశానికే ప్రత్యేక ఆకర్షణగా మారింది.
వియత్నాం వచ్చే విదేశీ పర్యాటకులు పనికట్టుకుని మరీ కాన్‌థో నగరానికి వచ్చి, ఈ ఇంటిని కళ్లారా చూసి వెళుతున్నారు.
చదవండి: పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో!
Comments
Please login to add a commentAdd a comment