
సాక్షి, ముంబై: ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఇప్పటికే కొన్ని దిగ్గజ కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కోవలో దేశీయ ఐటీ సేవల సంస్థ విప్రో ముందు వరసలో నిలిచింది. తాజాగా 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ విషయాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ బుధవారం స్వయంగా వెల్లడించారు.
తమ కంపెనీలో పనిచేసే 300మంది అదే సమయంలో తన పోటీదారుల కోసం పనిచేస్తున్నట్లు గుర్తించామని రిషద్ ప్రేమ్‌జీ ప్రకటించారు. మూన్‌లైటింగ్ విధానం కంపెనీ నిబంధనలను, పూర్తిగా ఉల్లంఘించడమే అని మరోసారి గట్టిగా వాదించారు. AIMA ఈవెంట్‌లో మాట్లాడుతూ, మూన్‌లైటింగ్ (ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడం) గురించి తీవ్రంగా విమర్శించిన ప్రేమ్‌జీ అటువంటి ఉద్యోగులకు కంపెనీలో చోటు లేదని స్పష్టం చేశారు. విప్రోతో కలిసి పని చేస్తున్నప్పుడు ప్రత్యర్థుల కోసం ఏకకాలంలో నేరుగా పని చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
కాగా మూన్‌లైటింగ్ విధానం అనైతికమని, నిబంధనలు అతిక్రమిస్తే వేటు తప్పదని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంతో ఇప్పటివరకూ లైట్ తీసుకున్న పలు ఐటీ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment