ఇసుక పేరుతో పచ్చ మోసం | - | Sakshi
Sakshi News home page

ఇసుక పేరుతో పచ్చ మోసం

Published Mon, Aug 12 2024 2:26 AM | Last Updated on Mon, Aug 12 2024 11:44 AM

-

అధికారిక ఇసుక రీచ్‌లు ఏడింటికి గాను మూడింటిలో నిల్వలు నిల్‌ 
అక్కడ కూడా వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు 
అనధికార పాయింట్లు ఏర్పాటు చేసుకుని టీడీపీ నేతల దందా 
నదులు.. ప్రైవేట్‌.. సర్కారు భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు 
భారీ ధరలకు విక్రయిస్తూ జనం నడ్డివిరగ్గొడుతున్న తెలుగు తమ్ముళ్లు 
పొరుగు రాష్ట్రాలకు సైతం అక్రమంగా తరలింపు 
అధికారులతో కుమ్మక్కై యథేచ్ఛగా దోపిడీ  

తిరుపతికి చెందిన శ్రీనివాసరావు ఆటోనగర్‌ సమీపంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించింది కదా అని గురువారం ట్రాక్టర్‌ తీసుకుని పాడిపేట వద్ద స్వర్ణముఖి నదికి వెళ్లారు. అక్కడ ఇసుక తీసుకునేందుకు అనుమతి లేదని స్థానికులు చెప్పారు. దీంతో ఇసుక అనుమతి కోసం తిరుపతి, రేణిగుంట తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లారు. వెంకటగిరి లేదా నాగాలాపురం, పిచ్చాటూరు మండలాల్లోని అధికారిక రీచ్‌లకు వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక శుక్రవారం ఉదయం ముందుగా వెంకటగిరి మండలం మోగళ్లగుంటలోని రీచ్‌కు కారులో చేరుకున్నారు. అక్కడ ఇసుక నిల్వ లేకపోవడంతో దొరవారిసత్రం మండలం మావిళ్లపాడులోని ఇసుక రీచ్‌కు వెళితే మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఉసూరుమంటూ నాగలాపురం మండలం సుబ్బానాయుడు కండ్రిగకు చేరుకున్నా అక్కడా ఇసుక లేదు. ఇక మిగిలిన పిచ్చాటూరు మండలం అడవికోయంబేడు రీచ్‌కు వెళితే ఇసుకైతే ఉంది కానీ.. డంప్‌ యార్డు వద్ద అధికారులెవ్వరూ లేరు. కాపలాగా ఓ కానిస్టేబుల్‌ ఉన్నారు. ఇసుక కోసం వచ్చిన సుమారు 100 టిప్పర్లు ఉదయం నుంచి వేచి ఉన్నాయి. రాత్రి వరకు ఎదురుచూసి తిరిగి తిరుపతికి వచ్చేశారు.  శ్రీనివాసరావు తన కారుకి రూ.2,500 పెట్రోల్‌ పట్టుకుని రోజంతా సుమారు 350 కిలోమీటర్లు ప్రయాణించి తిప్పలు పడినా చివరకు ఇసుక దొరకలేదు.  

 కుప్పం పట్టణానికి చెందిన మురుగప్ప అసంపూర్తిగా నిలిచిపోయిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకునేందుకు అప్పుచేశాడు. ఈనెల 9వ తేదీన పనులు ప్రారంభించాడు. నిర్మాణ పనుల కోసం ఇసుక తెచ్చుకునేందుకు ప్రయతి్నంచాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్కారు ఏర్పాటు చేసిన రీచ్‌ల వద్దే ఇసుక కొనుగోలు చేయాలి అని అధికారులు స్పష్టం చేశారు. కుప్పానికి సమీపంలో ఇసుక తెచ్చుకునేందుకు అనుమతులు లేవని తెగేసి చెప్పారు.  దీంతో సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని గంగవరం మండలం నాలుగురోడ్ల కూడలి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌కు వెళ్లాడు. తీరా అక్కడ రీచ్‌లో ఇసుక లేదు. తిరిగి వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉట్టి చేతులతో ఇంటికి వచ్చేశాడు. చివరకు చేసేది లేక కుప్పం సమీపంలో తయారుచేసే కృత్రిమ ఇసుకను అధిక ధరకు కొనుగోలు చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించుకున్నాడు.

శ్రీకాళహస్తికి చెందిన రమేష్‌బాబు స్వగృహ నిర్మాణం చేపట్టాడు. పట్టణానికి సమీపంలోని విరూపాక్షిపురం, పెన్నలపాడులో ఇసుక దొరుకుతుందని తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు. టిప్పర్‌ ఇసుక తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచాడు. వెంటనే అక్కడున్న టీడీపీ నేతల అనుచరులు అడ్డుకున్నారు.  ‘మీరంతా నదిలో యంత్రాలతో తవ్వి ఇసుక తరలిస్తున్నారు కదా.’ అని రమేష్‌బాబు ప్రశ్నించడంతో కొట్టినంత పనిచేశారు. మరి ఇసుక కావాలంటే ఏం చేయాలని అడిగితే టిప్పర్‌ ఇసుకకు రూ.25వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తాము అడిగినంత సొమ్ము ఇస్తే ఇసుకను ఇంటికే చేరుస్తామని స్పష్టం చేశారు. ఇసుక ఉచితమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు కదా అని రమేష్‌బాబు అడిగితే.. అదంతా తమకు తెలియదని, నగదు కడితేనే ఇసుక పంపుతామని తేలి్చచెప్పారు. అక్కడి నుంచి పలువురికి ఫోన్‌చేసి ఇసుక గురించి ఆరా తీసినా ఎక్కడా ఉచిత ఇసుక  దొరకదని, టీడీపీ వాళ్లే విక్రయిస్తున్నారని తెలియడంతో చేసేదిలేక రమేష్‌బాబు రూ.25వేలు చెల్లించి టిప్పర్‌ ఇసుక కొనుగోలు చేసుకున్నాడు.

  • ‘‘మీ ఊరి దగ్గర వాగు ఉందా..? కాలువ ఉందా..? నది ఉందా..? అక్కడకు వెళ్లి తట్టలతో తెచ్చుకుంటారో.. ఎద్దుల బండిలో తెచ్చుకుంటారో.. కావాల్సినంత ఇసుకను ఉచితంగా తీసుకెళ్లండి.. ఎవరు వద్దంటారు..? పైసా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.’’ అని చాలా తేలిగ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించేశారు. అంతలోనే బండిలో ఇసుక తరలించడం నిషేధం అంటూ ప్లేటు మార్చేశారు. ఎప్పటికప్పుడు ఉచిత ఇసుక అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారు. దిగితే కానీ లోతు తెలియదు అన్నట్టు.. ఇసుక కోసం వెళ్లిన వారికే లోగుట్టు తెలుస్తోంది. ఉచితం పేరిట టీడీపీ నేతల అనుచిత వైఖరి అర్థమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీచ్‌లలో మాత్రం ఇసుక రేణువు కూడా ఉండదు. అదే పచ్చమూక అనధికారికంగా పాగా వేసిన పాయింట్లలో మాత్రం కావాల్సినంత ఉంటుంది. అక్కడ వాళ్లు చెప్పిందే రేటు.. అడిగినంత చెల్లిస్తేనే పనవుతుంది. ఉచిత ఇసుక అంటూ ఊదరగొడుతూ జనం చెవిలో పువ్వులు పెడుతున్న కూటమి సర్కారు నాటకాలపై సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వం ఏడు ఇసుక రీచ్‌లను అధికారికంగా ఏర్పాటు చేసింది. అయితే వాటిలో కేవలం మూడు రీచ్‌లలో మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. తిరుపతి జిల్లా  పిచ్చాటూరు అడవికోయంబేడు, చిత్తూరు జిల్లా గంగవరం మండలం నాలుగురోడ్ల కూడలి, చిత్తూరు రూరల్‌ మండలం దిగువమాసపల్లె, పాలూరులో మాత్రమే ఇసుక నిల్వలు ఉన్నాయి. మిగిలిన నాలుగు రీచ్‌లలో ఇసుక డంప్‌లు లేవు. ప్రభుత్వం ఉచితమంటూ ప్రకటించిన  రెండు రోజులు మాత్రమే ఇక్కడ ఇసుక డంప్‌చేశారు. తర్వాత ఖాళీ అయిన రీచ్‌లలో ఇసుకను మళ్లీ డంప్‌ చేయలేదు.    


యథేచ్ఛగా ట్రాక్టర్లతో ఇసుక తరలింపు 

అడిగినంత చెల్లిస్తేనే.. 
ప్రస్తుతం మూడు రీచ్‌లలో ఉన్న ఇసుక కోసం వెళ్లిన వినియోగ దారులకు నిర్వాహకుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం టన్ను ఇసుక రూ.155 లెక్కన ట్రాక్టర్‌ (ఐదు టన్నులు)రూ.775 అవుతుంది. బాడుగ 0–10 కిలోమీటర్ల అయితే రూ.1,200. అదే టిప్పర్‌ ఇసుక అయితే రూ.1,550. దూరం పెరిగే కొద్దీ వాహనం బాడుగ పెరుగుతుంది. ఇదిలా ఉంచితే.. టీడీపీ నేతలు ఒక వాహనానికి అదనంగా రూ.3వేలు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని అధికారులతో కలిసి వాటాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. పిచ్చాటూరు మండలం అడవికోయంబేడులో అదనపు వసూళ్లకు పాల్పడడంతో వినియోగదారులు నిలదీశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే అధికారులు శుక్రవారం ఇసుకను విక్రయాలు నిలిపివేసినట్లు సమాచారం. ఫలితంగా వందలాది వాహనాలు రోజంతా వేచి ఉండాల్సి వచ్చింది.  


పిచ్చాటూరు మండలం అడవికోయంబేడు రీచ్‌లో ఇసుక నింపకపోవడంతో బారులు తీరిన వాహనాలు 

ఊరూరా అక్రమ రీచ్‌లు! 
ప్రభుత్వ రీచ్‌లలో ఇసుక లేకుండా చేసి.. కూటమి నేతలు సొంతంగా ఇసుక పాయింట్లు ఏర్పాటు చేసుకున్నారు. చంద్రగిరి నుంచి నాయుడుపేట వరకు స్వర్ణముఖి నదీ తీరంలో టీడీపీ నేతల అనధికారికంగా రీచ్‌లే కనిపిస్తున్నాయి.  భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. కంటైనర్ల ద్వారా చెన్నై, బెంగుళూరుకు తరలించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. మరో వైపు రైతులను బెదిరించి వారి భూముల్లోని ఇసుకను సైతం తవ్వేసి విక్రయించేస్తున్నారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజక వర్గాల పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టారు. రెండు రోజుల క్రితం తిరుపతి రూరల్‌ మండలం పాడిపేట వద్ద, ఏర్పేడు మండలం పెనుమల్లం వద్ద వెలుగుచూసిన టీడీపీ నేతల బాగోతమే ఇందుకు నిదర్శనం. డీకేటీ పట్టాలు పొందిన రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో టీడీపీ నేతలు దౌర్జన్యంగా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి వందలాది వాహనాల ద్వారా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అదే విధంగా శ్రీకాళహస్తి మండల పరిధిలోనూ ఇదే తరహాలో అక్రమాలు జరుగుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకను రూ.5వేల నుంచి రూ.7వేలకు విక్రయించి డబ్బులు పోగేసుకుంటున్నారు. టిప్పర్‌ అయితే రూ.25వేల నుంచి రూ.36వేలకు విక్రయించేస్తున్నారు. చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు అయితే లోడ్‌ ఇసుక రూ.లక్షపైనే ఉంటుందని అంచనా.


పాడిపేట వద్ద స్వర్ణముఖిలో ఇసుక తవ్వకాలకు వచ్చిన టీడీపీ వారిని అడ్డుకున్న స్థానికులు(ఫైల్‌) 

వెలుగులోకి మరో మోసం 
ఇసుక ఉన్న రీచ్‌ల వద్ద అధికారులు, టీడీపీ నేతలు లాలూచీ పడి ఎవరికీ అనుమానం రాకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. 10 టన్నులకు చలానా కట్టి టిప్పర్‌లో 15 టన్నులు ఇసుక నింపి సొమ్ముచేసుకుంటున్నారు. అలాగే 4 టన్నులకు రశీదు వేసి ట్రాక్టర్‌లో 5 టన్నుల ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు.


తట్టలతో ఇసుక లోడ్‌ చేస్తున్న కూలీలు 

తమ్ముళ్లవైతే కేసే లేదు!
టీడీపీకి చెందిన వారు ఎక్కడైనా ఇసుకను తవ్వి తరలించుకెళ్లినా అధికారులు పట్టించుకోరు. ఇంకొకరు చలానా కట్టి ఇసుక తీసుకెళుతున్నా కేసులు తప్పవు. శ్రీకాళహస్తి పరిధిలో ఓ వ్యక్తి రూ.1,200 చెల్లించి ట్రాక్టర్‌ ఇసుక తీసుకెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పైసా కట్టకుండా రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ పట్టుబడ్డారు. ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాలను స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత ఒకరు పోలీసులకు ఫోన్‌ చేయటంతో తెలుగు తమ్ముళ్లను మాత్రం రాచమర్యాదలు చేసి విడిచిపెట్టేశారు. ప్రభుత్వానికి నగదు చెల్లించి ఇసుక తరలించిన వ్యక్తిపై మాత్రం కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ సీజ్‌ చేయడం గమనార్హం.

రాచ‘మార్గం’లో..  
అక్రమార్జన కోసం టీడీపీ నేతల కుయుక్తులు అన్నీ ఇన్నీ కావు. ఇసుక తవ్వకాల కోసం ఏకంగా స్వర్ణముఖి నదిలోకి పలు ప్రాంతాల్లో రహదారులు ఏర్పాటు చేసేశారు. నేరుగా నది మధ్యలోకే వెళ్లేలా దారులు వేసేశారు. ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు సులువుగా సజావుగా బయటకు వచ్చేలా ఆయా మార్గాలను రూపొందించారు. ఈ క్రమంలోనే యంత్రాలు అందుబాటులోని చోట్ల ఇసుక లోడ్‌ చేసేందుకు కూలీలను వినియోగిస్తున్నారు. ఒక్కో వాహనానికి ఇంత అని కూలి చెల్లించి.. అది కూడా ఇసుక కొనుగోలు చేసేవారిపైనే భారం మోపుతున్నారు. ఏది ఏమైనా కాసులు మూటగట్టుకోవడమే లక్ష్యంగా నదీమతల్లికి గర్భశోకం కలిగిస్తున్నారు.

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement