సుమేధ పడినట్టు భావిస్తున్న నాలా ఇదే..
నేరేడ్‌మెట్ (హైదరాబాద్): అమ్మా... కాసేపు ఆడుకొని వస్తానని తల్లికి చెప్పిందా చిన్నారి. సరదాగా సైకిల్ తొక్కుదామని బయటికి వెళ్లింది. ఇక ఎప్పటికీ కనిపించనంత దూరానికి వెళ్లిపోయింది. నోరు తెరిచిన ఓపెన్ నాలా ఆ పన్నెండేళ్ల బాలికను మింగేసింది. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యా నికి అభంశుభం తెలియని చిన్నారి బలైపోయింది. సైకిల్ తొక్కడానికి వెళ్లి అదృశ్యమైన బాలిక చివరకు చెరువులో శవమై తేలింది. కనిపించ కుండా పోయిన దాదాపు పన్నెండు గంటల తరువాత నాలా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని బండచెరువులో బాలిక విగతజీవిగా లభించింది. ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగిన తమ గారాలపట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద సంఘ టన హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ ఠాణా పరిధిలో... ఈస్ట్ దీనదయాళ్‌నగర్‌లో జరిగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈస్ట్ దీనదయాళ్‌నగర్ రోడ్ నం.2లోని అద్దె ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగి అభిజిత్ కపూరియా, సుకన్య దంపతులు నివసిస్తున్నారు. రెండు నెలల కిందటే వీరు కాకతీయనగర్ నుంచి దీనదయాళ్‌నగర్‌కు మారారు. వీరికి కూతురు సుమేధ కపూరియా (12), ఒక కుమారుడు ఉన్నారు. కూతురు సుమేధ స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. గురు వారం సాయంత్రం సుమారు 6.15 గంటల ప్రాంతంలో సుమేధ సైకిల్ తొక్కడానికి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. అంతర్గత రోడ్లపై 6.26 వరకు సైకిల్ తొక్కుతున్నట్టు కాలనీలోని సీసీ టీవీలో రికార్డయింది. ఆ తరువాత బాలిక అదృశ్యమైంది. రాత్రి 7 గంటలు కావస్తున్నా కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కాలనీలో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. తెలిసిన వారిని అడిగినా జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి కాలనీలోని నాలాలు పొంగిపోర్లుతున్నాయి. ప్రమాదవశాత్తు కూతురు నాలాలో పడిపోయిందా? అనే అనుమానం కలిగింది. బాలిక అదృశ్యమైన విషయం స్థానికులకు తెలియడంతో వారూ తల్లిదండ్రులతో కలిసి వెతకడం ప్రారంభించారు. మూడు గంటల పాటు గాలించినా జాడ తెలియలేదు.
గురువారం సాయంత్రం కాలనీలో సైకిల్‌పై వెళుతున్న బాలిక సుమేధ (సీసీ టీవీ దృశ్యం)
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి 10 గంటలకు కాలనీకి చేరుకొని అర్థరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రెస్క్యూ బృందం వచ్చి గాలింపు మొదలుపెట్టింది. కాలనీలోని మురుగునీరు వెళ్లే బండచెరువు నాలాలో రెస్క్యూ బృందం వెతుకుతుండగా సుమేధ తొక్కిన సైకిల్ లభించింది. అదే నాలా వెంట గాలిస్తూ సుమారు రెండు కి.మీ.దూరంలో ఉన్న బండచెరువు వద్దకు వెళ్లిన రెస్క్యూ బృందానికి బాలిక సుమేధ విగతజీవిగా లభించింది. మృతదేహాన్ని బయటకు తీసిన అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. కాసేపు ఆడుకొని వస్తానని చెప్పి వెళ్లిన కూతురు...చెరువులో శవంగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం చూసి కాలనీ వాసులు కంటతడిపెట్టారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నేరేడ్‌మెట్ సీఐ నర్సింహ్మాస్వామి చెప్పారు.
ఎవరు తెచ్చిస్తారు?
తన కూతురు మరణానికి కారణం ఎవరని సుమేధ తండ్రి అభిజిత్ కపూరియా ప్రశ్నించారు. నాలాను నిర్లక్ష్యంగా వదిలేయడం కారణంగానే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నామని, సుమేధ ప్రాణాలను ఎవరు తీసుకొస్తారంటూ కన్నీరు మున్నీరయ్యారు.
జీహెచ్‌ఎంసీ తీరుపై ఆగ్రహం
ఓపెన్‌నాలా వల్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టకపోవడం మూలంగానే బాలిక సుమేధ ప్రమాదానికి గురై మరణించిందని స్థానికులు తీవ్రంగా విమర్శించారు. బాలిక అదృశ్యమైన విషయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలియజేసినా స్పందించలేదని, సకాలంలో గాలింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహారించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు బాలిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఈస్ట్ దీనదయాళ్‌నగర్‌ను సందర్శించి నాలా పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. బాలిక మృతిపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.
కలివిడిగా ఉండేది
చిన్నారి సుమేధ మా దగ్గర భరత నాట్యం నేర్చుకుంటోంది. రోజూ మధ్యాహ్నాం వేళ ఒక గంట భరత నాట్యం నేర్చుకునేది. మా కాలనీకి వచ్చి రెండు నెలలే అవుతున్నా...గడిచిన నెలన్నర రోజులుగా భరతం నాట్యం నేర్చుకోవడానికి వచ్చేది. నాట్యంలో మెళకువలను ఇట్టే గ్రహించేది. స్నేహితులతోనూ కలివిడిగా ఉండేది. షీ ఈజ్ వెరీ షార్ప్. నాట్యం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మా ఇంట్లోని కుక్కపిల్లతో చాలాసేపు ఆడుకునేది. పెట్స్ అంటే ఇష్టమని సుమేధ చెబుతుండేది. మాతో కలిసిపోయి ఆడుతూపాడుతూ ఉండే చిన్నారి నాలాలో పడి మృతి చెందటం బాధ కలిగించింది. –అర్షిత, నాట్య శిక్షకురాలు
ప్రమాదమేనా?
బాలిక సుమేధ అదృశ్యం, మృతి సంఘటన ప్రమాదమా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు నాలాలో పడి.. అందులో కొట్టుకుపోయి చనిపోయిందా? ఎవరైనా పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైకిల్ తొక్కుతుండగా బాలికతో ఎవరైనా మాట్లాడారా? నాలాలో పడితే రెండు కి.మీ. దూరంలోని చెరువు వరకు కొట్టుకుపోయినా.. బాలిక ముక్కు నుంచి రక్తం రావ డం మినహా ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవ డంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ‘సైకిల్‌పై తిరుగుతూ కనిపించిన సుమేధ నాలా వద్ద నుంచి వెళుతుండగా చూశాను. తరువాత ఆమె కోసం వెతుకుతున్నారని తెలిసి నాలా ప్రాంతంలో గాలించాం’ అని కాలనీవాసి జ్ఞానకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment