24 గంటల్లోనే ఇద్దరూ అరెస్టు | AP Govt takes immediate action in autodriver Salam family suicide case | Sakshi
Sakshi News home page

24 గంటల్లోనే ఇద్దరూ అరెస్టు

Published Mon, Nov 9 2020 3:21 AM | Last Updated on Mon, Nov 9 2020 9:53 AM

AP Govt takes immediate action in autodriver Salam family suicide case - Sakshi

సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌

సాక్షి, అమరావతి, నంద్యాల/బొమ్మలసత్రం: కర్నూలు జిల్లాలో ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం అంతే వేగంగా స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించింది. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బాధితుడు తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు 24 గంటలలోపే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌లను సస్పెండ్‌ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఘటనపై విచారణకు ప్రభుత్వం నియమించిన పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదివారం ఉదయమే నంద్యాల చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమన్న ప్రభుత్వ వైఖరి దీని ద్వారా మరోసారి స్పష్టమైంది. ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరును మైనార్టీ వర్గాలు స్వాగతిస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్‌ షేక్‌ అబ్దుల్‌ సలామ్‌ (45), భార్య నూర్జహాన్‌ (38), కుమారుడు దాదా ఖలందర్‌ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వతేదీన పాణ్యం వద్ద గూడ్స్‌ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. 

తక్షణమే చర్యలకు సీఎం ఆదేశం..
నంద్యాలలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తన దృష్టికి రాగానే ముఖ్యమంత్రి జగన్‌ తక్షణమే స్పందించారు. క్షుణ్నంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న సీఎం జగన్‌ స్వయంగా డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. ఘటనపై హోంమంత్రి, డీజీపీలను నివేదిక కోరారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌పీ బెటాలియన్‌ ఐజీ శంకబ్రతబాగ్చీ, గుంటూరు అడిషనల్‌ ఎస్పీ హఫీజ్‌ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ సవాంగ్‌ ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులు నంద్యాల చేరుకుని విచారణ చేపట్టారు.

ఏ సెక్షన్లు అంటే..
సస్పెండైన సీఐ సోమశేఖర్, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌లపై పలు ఐపీసీ సెక్షన్లు కింద  పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌  323 (ఉద్దేశపూర్వకంగా వేధించడం, బాధించడం), 324 (మారణాయుధాలు చూపించడం, బెదిరించడం), 306 (ఆత్మహత్యకు పురిగొల్పడం) తదితర సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి.

సలామ్‌ సెల్‌ఫోన్‌ సీజ్‌...
వారిని 24 గంటల్లో కోర్టులో హాజరు పరుస్తామని ఏఎస్పీ గౌతమిసాలి, డీఎస్పీ పోతురాజు ఆదివారం రాత్రి విలేకరులకు తెలిపారు. విచారణ పేరుతో భయపెట్టడం, బెదిరింపులకు పాల్పడటం, ఆడవారి పట్ల అమర్యాదగా మాట్లాడటం, ఆత్మహత్యకు ప్రేరేపించడం లాంటివి ఎవరు చేసినా తప్పేనన్నారు. అబ్దుల్‌ సలాం సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశామని, ఆధారాలను కోర్టులో అందజేస్తామని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్‌ సలాం బంధువులను ఏఎస్పీ గౌతమిసాలి నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌లో విచారించారు. నూర్జహాన్‌ తల్లి మాబున్నీసా నుంచి వివరాలు సేకరించారు. మరో 10 మంది పోలీసు సిబ్బందిని కూడా విచారించామని, ఈనెల 2వతేదీన సలాం ఆటోలో నగదు పోగొట్టుకున్న భాస్కర్‌రెడ్డిని కూడా ప్రశ్నించినట్లు డీఐజీ వెంకటరామిరెడ్డి తెలిపారు. బాధ్యులందరిపై  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

స్వాగతించిన ముస్లిం మైనార్టీలు..
ఘటనపై ముఖ్యమంత్రి వేగంగా స్పందించి దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించడం, పోలీసు శాఖ ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ మైనారిటీ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యను మైనార్టీలు స్వాగతించారు. 

దర్యాప్తు కొనసాగుతోంది: డీజీపీ సవాంగ్‌
ముఖ్యమంత్రి ఆదేశాలతో విచారణ చేపట్టిన ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం చర్యలు తీసుకున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. తప్పుచేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తిలేదని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement