వైఎస్సార్‌సీపీ నేతలపై మారణాయుధాలతో దాడి
నలుగురికి తీవ్ర గాయాలు
మాజీ మంత్రి బుగ్గన బంధువుల క్రషర్ మూసివేతకు కుట్ర
డోన్: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి గ్రామంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకుడు కృష్ణమూర్తి తదితరులపై శుక్రవారం మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ సమీపంలోని వశిష్ట క్రషర్ మిషన్‌లో పనులు జరగకుండా టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ నారాయణ, ఆయన అనుచరులు కూలీలను అడ్డుకుంటూ దాడులకు తెగబడుతున్నారు. క్రషర్ నడవాలంటే స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అనుమతి తీసుకోవాలని, కప్పం కట్టాలని నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
శుక్రవారం మూడోసారి క్రషర్ దగ్గరకు వెళ్లి మూసేయాలని బెదిరించారు. క్రషర్ మిషన్ ఏర్పాటుకు సహకరించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కృష్ణమూర్తిని దుర్భాషలాడటమేగాక ఆయన అంతుచూస్తామంటూ హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకుని వైఎస్సార్‌సీపీ నాయకుడు కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి క్రషర్ మిషన్ వద్దకు వెళ్తుండగా గ్రామంలోని ఓ హోటల్ వద్ద ఉన్న టీడీపీ నాయకుడు నారాయణ, అతడి అనుచరులు మారణాయుధాలతో దాడిచేశారు. ఈ దాడిలో కృష్ణమూర్తి, రామరంగడు, శేషు, ఆదినారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని బంధువులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
దాడి సందర్భంగా కృష్ణమూర్తి అనుచరులు ప్రతిఘటించడంతో టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ నారాయణ, నడిపి ఓబులేసు, శ్రీనివాసులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ అనుమతులతోపాటు ప్రభుత్వపరమైన అనుమతులు ఉన్నా వశిష్ట క్రషర్ నిర్వాహకులు, కూలీలు భయం గుప్పిట్లో బతకాల్సి వస్తోంది. ఈ క్రషర్ నిర్వాహకులు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు బంధువులనే కారణంతో.. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రోద్బలంతో మండల, గ్రామ టీడీపీ నాయకులు క్రషర్‌పై దాడులకు దిగుతుండటం గమనార్హం.
చెలరేగుతున్న తెలుగుదేశం
గతంలో ఎన్నడూ లేనివిధంగా కోట్ల ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడిచేస్తున్నారు. ఇటీవల డోన్ మండలం వెంకటనాయునిపల్లిలో రెండు కుటుంబాల మధ్య పొలం గట్టు తగాదాలో ఒక వర్గానికి చెందిన మాధవయ్యపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడిచేసి గాయపరిచారు. అతడు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు.
మాధవయ్య అనుచరులు ప్రత్యర్థుల ఇళ్లపై దాడిచేసి ద్విచక్రవాహనాలు, టీవీలు, నిత్యావసర వస్తువులు ధ్వంసం చేయడమేగాక పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారికి గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు మద్దతునిస్తున్నారు. అయినప్పటికీ ఈ నెపాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులపైకి నెట్టేందుకు ప్రయతి్నంచడం పట్ల గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఆ క్వారీ నాది కాదు...
అయినా టీడీపీ గూండాలు దాడి చేస్తున్నారు
క్వారీ అక్రమమో.. సక్రమమో? తేల్చాల్సింది ప్రభుత్వమే
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లాలో ప్యాపిలి మండలం పోదొడ్డిలోని కంకర క్వారీ తనది కాదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన దగ్గర నుంచి స్థానిక టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరిగా వ్యవహరిస్తూ.. క్వారీపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం వేటకొడవళ్లతో క్వారీలోకి ప్రవేశించి దాడులు చేశారని.. వేయింగ్ బ్రిడ్జిని లాక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ కార్యకర్తల తీరుతో పోదొడ్డి గ్రామంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో చివరకు గ్రామంలోని మరొక వర్గం టీడీపీ అరాచకాలను ప్రశ్నించడంతో ఘర్షణ తలెత్తిందని చెప్పారు. తనకు సంబంధం లేకపోయినా.. తప్పుడు రాతలు రాస్తూ బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ క్వారీ సక్రమమా? లేదా అక్రమమా? అన్నది తేల్చాల్సింది ప్రభుత్వమే గానీ స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు, ఆ పారీ్టకి చెందిన గూండాలు కాదన్నారు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్న టీడీపీ గూండాల తప్పుడు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment