సాక్షి, హైదరాబాద్/నిర్మల్ చైన్‌గేట్/భైంసా: పరీక్షలు రాస్తున్న విద్యార్థిని.. ఉన్నట్టుండి మధ్యలో లేచి వెళ్లిపోయింది.. అలాగని హాస్టల్ గదికి కాకుండా బాత్రూంలోకి వెళ్లింది.. అందులోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది. నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ఐటీలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
పరీక్షల ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు ట్రిపుల్ ఐటీ అధికారులు చెప్తున్నారు. అయితే పరీక్ష హాల్‌లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారంటూ పలువురు విద్యార్థులను పరీక్ష సిబ్బంది, చీఫ్ వార్డెన్ మందలించారని.. దీనితో ఆందోళనకు లోనైన దీపిక బలవన్మరణానికి పాల్పడిందని విద్యార్థులు అంటున్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం గొర్రెకల్ గ్రామానికి చెందిన వడ్ల దీపిక.. బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ–1 చదువుతోంది. మంగళవారం ట్రిపుల్‌ఐటీలో జరిగిన పరీక్షకు హాజరైంది. అయితే మధ్యలోనే ఆమె పరీక్ష హాల్ నుంచి బయటికి వెళ్లిపోయింది. హాస్టల్ గదికి వెళ్లాల్సిన ఆమె.. పరీక్ష హాల్ సమీపంలో ఉన్న బాత్రూంలోకి వెళ్లింది. చాలాసేపైనా ఆమె బయటికి రాకపోవడం, పిలిచినా పలకకపోవడంతో అక్కడివారు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
వారు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. దీపిక బాత్రూంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్‌కు.. అక్కడి నుంచి భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే విద్యార్థిని మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని నిర్మల్‌కు తరలించారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
అయితే విద్యార్థిని దీపిక ఆత్మహత్య విషయం చాలాసేపు బయటికి రాకుండా అధికారులు కట్టుదిట్టం చేశారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులను మోహరించారు. లోనికి ఎవరినీ అనుమతించలేదు. విషయం తెలుసుకున్న విద్యార్థి, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు గేటు వద్ద ఆందోళనకు దిగారు. దీపిక ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పరీక్షల ఒత్తిడి అంటున్న అధికారులు
పరీక్షల ఒత్తిడి కారణంగానే దీపిక ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నామని ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్ చెప్పారు. ట్రిపుల్‌ఐటీలో ముగ్గురు సభ్యులతో కౌన్సెలింగ్ డిపార్ట్‌మెంట్ ఉందని, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా మని తెలిపారు. అయినా ఈ ఘటన చోటుచేసుకో వడం బాధాకరమన్నారు. దీపిక ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తేల్చేందుకు నలుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు.
నా బిడ్డను వేధించారు
ట్రిపుల్‌ఐటీ సిబ్బంది, అధికారులు తన బిడ్డను వేధించారని, లేనిపోని విషయాలు చెప్పి భయభ్రాంతులకు గురిచేశారని దీపిక తండ్రి వడ్ల వీరన్న ఆరోపించారు. ట్రిపుల్ ఐటీ అధికారులు కొన్ని రోజుల క్రితం తనను పిలిపించి ఆమె వాట్సాప్‌లో చాటింగ్‌లు చేస్తోందని ఆరోపించారని వివరించారు. తన బిడ్డను అడిగితే.. ట్రిపుల్‌ఐటీలో కొందరు తనపై కక్షగట్టి ఇలా చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు.
ఈ విషయాన్ని వార్డెన్‌కు, ఉన్నతాధికారులకు వివరించేందుకు తాను ప్రయత్నించినా.. పట్టించుకోలేదన్నారు. తన బిడ్డకు కౌన్సెలింగ్ చేసి దారిలో పెడతానని రాసివ్వాలని ఒత్తిడి చేశారని.. లేకుంటే సీటు రద్దు చేసి ఇంటికి పంపుతామని బెదిరించారని ఆరోపించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు దీపిక తమకు ఫోన్ చేసి సిబ్బంది అనేక రకాలుగా వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు.
పత్తాలేని ట్రిపుల్‌ఐటీ అధికారులు
దీపిక చనిపోయి కొన్ని గంటలు గడిచినా, రెండు ఆస్పత్రులకు మృతదేహాన్ని తరలించినా.. ట్రిపుల్‌ఐటీ అధికారులు, అధ్యాపకులెవరూ రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాసరకు సమీపంలోనే మెరుౖగెన వైద్యసేవలు అందే నిజామాబాద్ పట్టణం ఉండగా.. ఆమెను భైంసాకు ఎందుకు తరలించారని దీపిక బంధువులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆమె మృతికి వర్సిటీ అధికారులే బాధ్యత వహించాలన్నారు.
సమగ్ర విచారణ జరపాల్సిందే..
ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని దీపిక ఆత్మహత్యపై అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులపై వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
మండిపడ్డారు. కాగా దీపిక ఆత్మహత్యకు ట్రిపుల్ ఐటీ అధికారులు కారణం చెప్పేంత వరకు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు అంగీకరించేది లేదని తండ్రి వీరన్న తేల్చి చెప్పారు.
ఏడాదిలో ముగ్గురు
ఆర్జీయూకేటీలో సమస్యలను పరిష్కరించాలంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగి మంగళవారం నేటికి ఏడాది అవుతోంది. రెగ్యులర్ వీసీని నియమించాలని, అధ్యాపకుల సంఖ్యను పెంచాలని, ఇతర వర్సిటీలతో అనుసంధానం చేయాలని, కనీస సౌకర్యాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ ఎండనకా, వాననకా వారం పాటు ఉద్యమించారు. విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సిటీకి వచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నాటి నుంచి ఇప్పటివరకు ట్రిపుల్‌ఐటీలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది.
బిడ్డ మార్చురీలో.. తండ్రి ఐసీయూలో..
దీపిక మృతిపై ట్రిపుల్‌ఐటీ అధికారులు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో ఆమె తండ్రి వీరన్న.. మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక నిర్మల్ జిల్లా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అప్పటికే పలువురు బంధువులు, బీజేపీ నేతలు కూడా ఆస్పత్రి వద్దకు వచ్చారు. పోలీసులు తండ్రిని తప్ప మరెవరినీ ఆస్పత్రిలోకి వెళ్లనివ్వలేదు. దీనితో బంధువులు, బీజేపీ నేతలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది.
ఆస్పత్రిలో బిడ్డ మృతదేహాన్ని ఉంచిన మార్చురీవైపు వెళ్తుండగానే వీరన్న ఛాతీలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీనితో వెంటనే ఆయనను ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ వైపు మార్చురీలో బిడ్డ మృతదేహం ఉండగా.. అదే ఆస్పత్రి ఐసీయూలో తండ్రికి చికిత్స జరుగుతుండటం అందరినీ కన్నీరు పెట్టించింది.
ఘటనపై కమిటీ వేశాం
ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని దీపిక ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. ఈ ఘటన షాక్‌కు గురిచేసింది. ఇంజనీరింగ్ ఫలితాల విడుదల నేపథ్యంలోనే నేను హైదరాబాద్‌లో ఉన్నాను. అసలేం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో అంతర్గత నిజ నిర్ధారణ కమిటీ వేశాం. త్వరలోనే ఘటనకు కారణాలు తెలుస్తాయి. విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దు. – వెంకటరమణ, ఇన్‌చార్జి వీసీ, ఆర్జీయూకేటీ
Comments
Please login to add a commentAdd a comment