సాక్షి, గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలో గురువారం పేలుడు సంభవించింది. జయరాజ్ ఫ్లైవుడ్ ఎంటర్ ప్రైజర్‌లో జరిగిన పేలుడు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విజయవాడకు చెందిన తండ్రి,కొడుకు స్క్రాబ్ కొనుగోలు చేసేందుకు వచ్చి మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై బాధాకరమని, ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రమాదంపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జయరాజ్ ఎంటర్ ప్రైజర్‌కు అనుమతులు లేవు
గన్నవరం మండలం సూరంపల్లి మహిళా పారిశ్రమికవాడలో నిర్వహిస్తున్న జయరాజ్ ఎంటర్ ప్రైజర్‌కు ఎలాంటి అనుమతులు లేవని గన్నవరం తాహసిల్దార్ నరసింహారావు తెలిపారు. అంతేకాకుండా ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏడేళ్ల నుంచి కంపెనీ నిర్వహిస్తున్నారని, లాక్‌డౌన్ అనంతరం నాలుగు రోజుల క్రితమే కంపెనీ తెరిచారన్నారు. విజయవాడకు చెందిన తండ్రీకొడుకులు స్కాప్ కొనుగోలు చేసేందుకు వచ్చారని, దాన్ని ఆటోలో లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు తెలిపారు. ఆ పేలుడు ధాటికి తండ్రీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, పోలీసులు కేసు నమోదు చేసి పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
బాధ్యులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నట్లు గన్నవరం సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పేలుడు ధాటికి తండ్రీకొడుకులు ఇద్దరూ పైకి ఎగిరి పడ్డారన్నారు. క్లూస్ టీమ్ అన్ని ఆధారాలు సేకరిస్తోందని, నివేదిక వచ్చాక పేలుడుకు గల కారణాలు తెలుస్తాయన్నారు. 304 పార్ట్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులు ఎవరైనా వారిపై కఠని చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment