
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో అనుమల్ల వెంకటరమణ (54) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్‌లో నివాసముండే అనుమల్ల వెంకటరమణ డైలీ ఫైనాన్స్ నిర్వహిస్తాడు. పట్టణ శివారులోని అర్బన్ కాలనీలోనూ వెంకటరమణకు ఓ ఇల్లు ఉండటంతో అక్కడి వాళ్లకు ఇచ్చిన రుణాల వసూలుకు ప్రతిరోజూ సాయంత్రం కాలనీకి వెళ్తాడు.
ఎప్పటిలాగే గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీలో డబ్బులు వసూలు చేసుకుని మోటార్ సైకిల్‌పై వెళుతుండగా, అదే కాలనీలో ఉంటున్న వాసాల రఘు (32) అనే యువకుడు వెంటపడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛాతీ, వీపు భాగాల్లో గాయాలతో వెంకటరమణ కింద పడిపోయాడు. కిందపడిపోయిన వెంకటరమణపై రఘు మరోసారి కత్తితో దాడిచేయడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం రఘు మోటార్‌సైకిల్‌పై పరారయ్యాడు.
దాడికి పాల్పడిన సమయంలో రఘును అడ్డుకోవాలని వెంకటరమణ స్థానికులను ప్రాధేయపడినా.. రఘు బెదిరింపులతో వారు దగ్గరకు రాలేకపోయారు. కాగా, హత్యకు గురైన వెంకటరమణకు కాలనీలో ఉన్న ఓ మహిళతో పరిచయం ఉన్నట్లు సమాచారం. అనంతరం సదరు మహిళ బంధువుతోనూ సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేసినట్టు.. ఈ క్రమంలోనే వెంకటరమణకు, రఘుకు మధ్య గతంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వెంకటరమణను హత్యచేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.