గుజ్జల శ్రీను సన్నిహితుడు ఉప్పు మల్లికార్జున ఇంట్లో సోదాలు చేస్తున్న సీఐడీ అధికారులు
సాక్షి, అమరావతి/ప్రొద్దుటూరు టౌన్: ఆప్కో అవినీతిపై మూడోరోజు సీఐడీ సోదాలు కొనసాగాయి. ఆదివారం వైఎస్సార్ జిల్లాలోని ఖాజీపేట, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప తదితర ప్రాంతాల్లో.. సొసైటీ అధ్యక్షులు, వారి బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రొద్దుటూరులో ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీను సన్నిహితుడు, మల్లేశ్వరి సొసైటీ అధ్యక్షుడైన ఉప్పు మల్లికార్జున ఇంటిలో ఆదివారం తనిఖీలు జరిపిన అధికారులు.. చేనేత సొసైటీల పేర్లతో ఉన్న సీళ్లు, కొన్ని పత్రాలను, చెక్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
► ఎర్రగుంట్ల పట్టణంలోని నారాయణనగర్ కాలనీలో నివాసం ఉన్న ఉప్పు ఈశ్వరయ్య, ఉప్పు శివ ఇంటిలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరు ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులుకు సమీప బంధువులు కాగా, సోదాల్లో విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
► గుజ్జల శ్రీను బంధువులు డి.శ్రీనివాసులు, ఆర్.ధనుంజయ్‌రావు నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విచారణలో భాగంగా తదుపరి సోదాలు నిర్వహిస్తామని సీఐడీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటివరకు రూ. 1.11కోట్ల నగదు, 10 కిలోల పైనే బంగారం
అప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనుకు సంబంధించిన ఇళ్లలో ఇప్పటివరకు రూ. 1.11 కోటి నగదుతోపాటు 10.48 కేజీల బంగారం, 19.56 కేజీల వెండి ఆభరణాలు, 43 బ్యాంకు పాస్ పుస్తకాలు, ఆప్కోకు చెందిన పలు రికార్డులు, ఒక డిజిటల్ లాకర్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment