సాక్షి, విశాఖపట్నం: ‘సెల్‌ఫోన్ దొంగలించాడన్న అనుమానంతో దళితుడైన పర్రి శ్రీకాంత్‌ను దారుణంగా హింసించారు. కర్రలు విరిగేటట్టు కొట్టారు. చిత్రహింసలు పెడుతూ వీడియోలు తీశారు. శిరోముండనం చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు సేకరించాం. ఈ దారుణ ఘటనలో ఉన్నవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. ఏడుగురిని అరెస్టు చేశాం’ అని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిమాని, బిగ్‌బాస్ ఫేమ్, సినీ దర్శకుడు నూతన్‌నాయుడు ఇంట్లో 20 ఏళ్ల దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌కు శిరోముండనం చేసి దారుణంగా హింసించిన సంఘటనకు సంబంధించిన వివరాలు కమిషనర్ శనివారం మీడియాకు వివరించారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం..
ఇంటికి పిలిచి కొట్టారు..
► విశాఖలోని గోపాల్‌కృష్ణనగర్‌లో నివాసం ంటున్న నూతన్‌నాయుడు ఇంట్లో శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ నాలుగు నెలల క్రితం పనికి చేరాడు. వ్యక్తిగత కారణాలతో నెల రోజుల క్రితం పని మానేశాడు.
► తమ ఇంట్లో ఐఫోన్ పోయిందని.. దాని గురించి మాట్లాడాలి ఇంటికి రావాలని నూతన్‌నాయుడి భార్య ప్రియామాధురి గతంలో శ్రీకాంత్‌ని పిలిచి విచారించారు.
► మళ్లీ శుక్రవారం మధ్యాహ్నం మరోసారి శ్రీకాంత్‌ను ఇంటికి పిలిచి తన సిబ్బందితో కొట్టించారు. బార్బర్‌ను పిలిపించి గుండు గీయించారు. ఈ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.
► అనంతరం అక్కడ నుంచి బయటపడిన శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెంటనే ఆధారాల సేకరణ
► ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు నూతన్‌నాయుడి ఇంటికి వెళ్లి సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను సేకరించారు.
► వీటి ఆధారంగా నూతన్‌నాయుడి భార్య ప్రియా మాధురి, బ్యూటీషియన్ ఇందిరారాణి, సూపర్‌వైజర్ వరహాలు, బార్బర్ రవికుమార్, పనిమనుషులు బాల గంగాధర్, సౌజన్య, ఝాన్సీలను అరెస్టు చేశారు.
► వీరికి కోవిడ్ పరీక్ష అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తామని సీపీ తెలిపారు.
► ఈ సంఘటనలో నూతన్‌నాయుడి ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.
► మీడియా సమావేశంలో డీసీపీ(క్రైం) సురేష్‌బాబు, ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ ఏసీపీ త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
పగబట్టి కొట్టారు
తాను వాళ్ల ఇంట్లో ఉద్యోగం మానేసి వేరోచోట చేరాననే పగతోనే తనను కొట్టి, గుండు గీయించారని బాధితుడు శ్రీకాంత్ మీడియాతో చెప్పాడు. సెల్‌ఫోన్‌తో తనకేమీ సంబంధం లేదంటున్నా వినకుండా ఇందిరారాణి దారుణంగా కొట్టిందన్నారు. తన ఫోటోలు స్కాన్ చేసి బయట పెట్టావంటూ ఇందిర ఆరోపించిందని తెలిపాడు. తానిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టడం సంతోషంగా ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment