స్క్రాచ్ చేస్తే గిఫ్ట్‌లు అంటూ గాలం
అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ భద్రత నిపుణులు
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అయిన మీషో పేరిట సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెర తీస్తున్నారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీషో కంపెనీ నుంచి వచి్చందని భ్రమపడేలా ఓ ఫామ్‌ను, స్క్రాచ్ కార్డును డిజైన్ చేసి సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేస్తున్నారు. వీటిని అందుకున్న వారిని అందులోని కార్డును స్క్రాచ్ చేయాలని సూచనల్లో పేర్కొంటున్నారు.
అలా స్క్రాచ్ చేసిన తర్వాత అందులో మీరు లక్కీ కస్టమర్ కింద లక్కీ కూపన్‌లో కారు, బంగారం వంటి ఖరీదైన బహుమతులు గెలుచుకున్నారని ఉంటుంది. ఇలా లక్కీ డ్రా తగిలిన వారు వెంటనే మీ స్క్రాచ్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, మేం అడిగే వివరాలు నమోదు చేయాలని చెబుతారు. ఏదైనా సందేహాలుంటే మీకు ఇచ్చిన దరఖాస్తులోని నంబర్లకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.
వివరాలిస్తే అసలుకే మోసం...
ఎవరైనా అమాయకులు ఈ ఉచ్చులో చిక్కితే ఇక సైబర్ నేరగాళ్లు తమ విశ్వరూపం చూపిస్తున్నారు. ఇలా స్క్రాచ్ కార్డుపై ఉన్న క్యూర్ కోడ్ స్కాన్ చేసి అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేస్తే ఇక అసలు మోసం మొదలవుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అనుమానాస్పద యాప్‌లు మనకు తెలియకుండానే మన ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ అవుతాయి. అదేవిధంగా మనం నమోదు చేసే బ్యాంకుఖాతా, వ్యక్తిగత వివరాలన్నీ తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకుఖాతాల్లోని డబ్బులు కొల్లగొడుతున్నారు.
ఇలాంటి కూపన్లు వస్తే నమ్మవద్దని, ఎలాంటి వివరాలు వారితో పంచుకోవద్దని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పట్టణప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా మోసాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment