దొంగ అనుకుని బాలుడిపై ఫామ్‌హౌస్‌ యజమాని దారుణం | Delhi Teen Thrashed By Farmhouse Owner, Bitten By Dogs | Sakshi
Sakshi News home page

Delhi Teen: దొంగగా భావించి చితకబాదాడు.. పారిపోయినా దక్కని ప్రాణాలు

Published Fri, Jul 9 2021 6:00 AM | Last Updated on Fri, Jul 9 2021 8:11 AM

Delhi Teen Thrashed By Farmhouse Owner, Bitten By Dogs - Sakshi

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దొంగ అని భావించి 16 ఏళ్ల బాలుడిని ఓ ఫామ్‌హౌస్‌ యజమాని కర్రతో చితకబాదాడు. అనంతరం ఆ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఎంత అరిచినా సాయం చేసేవారు లేక తీవ్ర గాయాలతో కొన్ని గంటలపాటు నరకయాతన అనుభవించిన బాధితుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ డ్రైవర్‌ కుమారుడైన సందీప్‌ మహతో(16) బుధవారం ఉదయం 11 గంటలకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి కపాషెరా సరిహద్దు ప్రాంతంలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు వారిని దొంగలుగా భావించి, యజమాని ప్రకృత్‌ సాంధూను అప్రమత్తం చేశాడు.

వెంటనే అక్కడికి చేరుకున్న యజమాని సాంధూ బాలుడు సందీప్‌ను బంధించాడు. మిగతా ఇద్దరు స్నేహితులు భయంతో పారిపోయారు. సందీప్‌ను ఫామ్‌హౌస్‌ యజమాని కర్రతో చితకబాదాడు. దీంతో బాలుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి తప్పించుకున్న బాలుడు కొంతదూరంలో రోడ్డుపై పడిపోయాడు. ఎంత అరిచినా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇంతలో వీధి శునకాలు అతడిపై దాడి చేశాయి. కొన్ని గంటల తర్వాత సందీప్‌ మరణించాడు. సాయంత్రం 4.30 గంటలకు ఓ వాహనదారుడు పోలీసులకు సమాచారం అందించాడు. సందీప్‌ మృతికి కారణమైన ఫామ్‌హౌస్‌ ఓనర్‌ ప్రకృత్‌ సాంధూ(35)తోపాటు రోహిత్‌(20), అతడి తండ్రి బినోద్‌ ఠాకూర్‌(62)ను అదుపులోకి తీసుకొని, హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement