సాక్షి ప్రతినిధి, విజయనగరం: తాగునీటి కోసం పొలాల్లోకి వచ్చిన నాలుగు ఏనుగులు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం పక్కుడుభద్ర గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఒక గున్న ఏనుగు, ఐదు పెద్ద ఏనుగుల గుంపు గత ఫిబ్రవరిలో ఒడిశా సరిహద్దులోని అడవుల్లోంచి భామిని మండలంలోకి వచ్చింది. మూడు నెలలుగా ఇక్కడి అడవుల్లో ఉంటూ ఆహారం, తాగునీటి కోసం సమీప పొలాల్లోకి వస్తుండేవి. ఎవరికీ హాని చేయకపోవడంతో వాటిని చూసేందుకు పార్వతీపురం మన్యం జిల్లావాసులే కాకుండా ఒడిశా నుంచి కూడా వస్తుండేవారు.
ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి పక్కుడుభద్ర గ్రామ సమీపంలోని పొలాల్లోకి వచ్చాయి. బొమ్మిక మిన్నారావుకు చెందిన బోరుబావి వద్దకు వెళ్లేందుకు యత్నించాయి. ఆ పక్కనే ఉన్న త్రీఫేజ్ విద్యుత్ లైన్, ట్రాన్స్‌ఫార్మర్‌ను గున్న ఏనుగు తన తొండంతో లాగింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై విలవిలలాడుతున్న గున్న ఏనుగును రక్షించేందుకు మరో మూడు పెద్ద ఏనుగులు ప్రయత్నించాయి. దీంతో నాలుగూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. వాటిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు వేలాది సంఖ్యలో పోటెత్తారు.
నాలుగు ఏనుగుల కళేబరాలకు విశాఖ జూ వైద్యాధికారి శ్రీనివాసరావు బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఘటన స్థలంలోనే వాటిని ఖననం చేసేందుకు రైతు మిన్నారావు అంగీకరించడంతో జేసీబీలతో పెద్ద గోతులు తీయించి కళేబరాలను ప్రొటోకాల్ ప్రకారం ఖననం చేశారు. విశాఖ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకంఠనాథరెడ్డి, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment