ముంబై: మహారాష్ట్రలో రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. శివసేనపై తిరుగుబాటు చేసి భాజపాతో కలిసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు ఏక్‌నాథ్ షిండే. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుందనే వాదనలు వెలువడ్డాయి. ఈ సమయంలోనే సీఎం షిండే ఢిల్లీ పర్యాటన చేపట్టటం ఆ వాదనలకు బలం చేకూర్చింది. ఇదే అదునుగా తీసుకున్న కొందరు కేటుగాళ్లు డబ్బులు దండుకునేందుకు ప్రయత్నించారు. షిండే కేబినెట్‌లో చోటు కల్పిస్తామని, అందుకు రూ.100 కోట్లు ఇవ్వాలని ఓ ఎమ్మెల్యేకు ఆఫర్ ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో ప్లాన్ అడ్డం తిరిగి కటకటాలపాలయ్యారు.
మంత్రివర్గంలో చోటు కోసం రూ.100 కోట్లకు బేరం ఆడారంటూ.. భాజపా ఎమ్మెల్యే రాహుల్ కుల్ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే పీఏ బాలక్రిష్ణ థోరట్‌కు జులై 16న రియాజ్ షేక్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ఎమ్మెల్యే రాహుల్‌తో ఆఫర్ గురించి మాట్లాడాలని చెప్పాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేతో తాను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానని, మీకు సాయం చేయాలనుకుంటున్నాని చెప్పాడు. ఈ క్రమంలో నారిమన్ పాయింట్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఇరువురు కలిశారు. ఈ సందర్భంగా తనకు సీనియర్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని, వారు మీకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని నమ్మించే ప్రయత్నం చేశాడు. అందుకు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాహుల్ కుల్.. వారితో బేరం ఆడి రూ.90 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల గుట్టు బయటపడింది.
ఇదీ చదవండి: లోక్‌సభలో ‘సేన’ నేతగా రాహుల్ షెవాలే: షిండే
Comments
Please login to add a commentAdd a comment