ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో ఇటీవల పోలీసులకు పట్టుబడిన రూ.50 లక్షల వ్యవహారంలో విస్తుగొలిపే విషయం బయటపడింది. మీడియా ముసుగులో కొందరు పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తేలింది. వివరాలు.. ఈ నెల 20న విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ బస్సును కంచికచర్ల పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విశాఖ పెందుర్తికి చెందిన మహా న్యూస్ చానల్ రిపోర్టర్ సూర్యనారాయణ వద్ద రూ.50 లక్షల బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు పూచీకత్తు రాయించుకొని.. వదిలిపెట్టారు. అయితే అదే బస్సులో హైదరాబాద్‌లో మరో రూ.3 కోట్ల నగదు కూడా దొరికినట్టు ప్రచారం జరిగింది.
విశాఖ నుంచి హైదరాబాద్‌కు బస్సులో ఇంత నగదు ఎందుకు తీసుకెళ్తున్నారు? అసలు ఆ మొత్తం వారికి ఎలా వచ్చింది? అనే కోణాల్లో పోలీసులు దృష్టి సారించేలోపే.. టీడీపీ మాజీ మంత్రులు రంగంలోకి దిగి సర్దుబాటు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో పోలీసులు దర్యాప్తును మళ్లీ పట్టాలెక్కించారు. దీనిపై ఆదాయ పన్ను శాఖ అధికారులకు కూడా సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన ఐటీ శాఖ.. దర్యాప్తు మొదలు పెట్టడంతో హవాలా కార్యకలాపాలు వెలుగు చూసినట్టు తెలిసింది. పట్టుబడిన రూ.50 లక్షలను విశాఖకు చెందిన ఒక రియల్టర్, బిల్డర్ ఇచ్చినట్టు చెబుతున్నారు.
టీడీపీ హయాం నుంచి మీడియా ముసుగులో రూ.కోట్లకు పడగలెత్తిన మీడియా హౌస్ కీలక వ్యక్తి.. పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలకు పాల్పడినట్టు ఐటీ అధికారులు గుర్తించారని సమాచారం. ఆ మీడియా హౌస్ కేంద్రంగా గత మూడేళ్లలో రూ.30 కోట్లకు పైగా సొమ్ము హవాలా రూపంలో చేతులు మారినట్టు తెలిసింది. టీడీపీకి చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలకు ఇందులో ప్రమేయముందని, వారి అండతోనే హవాలా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రాథమిక సమాచారంతో రంగంలోకి దిగిన ఐటీ శాఖ.. ఆ న్యూస్ చానల్ డైరెక్టర్స్‌పై కూడా నిఘా పెట్టింది. దీంతో వారిలో ఒకరు పరారీలో ఉన్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment