సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దళిత సామాజికవర్గానికి చెందిన సాక్షి విలేకరులు ఇద్దరిపై తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. లోకేశ్ పాదయాత్ర కవరేజికి వెళ్లిన ఓ విలేకరిపై బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేసి, హింసించారు. పాదయాత్రంలో జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలను చిత్రీకరించారన్న నెపంతో మరో మరో విలేకరిపై దాడికి పాల్పడ్డారు. లోకేశ్ పాదయాత్రపై వాస్తవాలను నిర్భయంగా రాస్తున్నారన్న అక్కసుతో లోకేశ్ ప్రైవేటు సైన్యం ఈ దాడులకు పాల్పడింది.లోకేశ్ పాదయాత్ర సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఒంగోలు నగరంలోని రవిప్రియ మాల్ వద్ద సెల్ఫీ కార్యక్రమం జరిగింది. కొందరు టీడీపీ కార్యకర్తలను సెల్ఫీకి అనుమతించకపోవడంతో అక్కడ గొడవ జరిగింది.
ఈ సమయంలో పాదయాత్ర కవరేజికి వెళ్లిన సాక్షి విలేకరి, దళిత సామాజిక వర్గానికి చెందన కరుణాకర్ ఆ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అది గమనించిన లోకేశ్ ప్రైవేటు సెక్యూరిటీ కరుణాకర్‌ను టెంట్‌లోకి లాక్కొని వెళ్లి డెయిరీ, సెల్‌ఫోన్, లాక్కొని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ పిడుగుద్దులు గుద్దారు. ‘సాక్షి’ విలేకరులకు బాగా బలిసింది.. మీ సంగతి తేలుస్తామని దూషిస్తూ గంటసేపు టెంట్‌లో నిర్బంధించారు. సెల్‌ఫోన్ మొత్తం పరిశీలించి ఫొటోలు డిలీట్ చేశారు. మరోసారి పాదయాత్రలో ఫొటోలు తీసినా, వ్యతిరేక వార్తలు రాసినా సహించేది లేదని, పాదయాత్రలో కనిపిస్తే చంపుతామంటూ లొకేశ్ పర్సనల్ సిబ్బంది బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ సంగతి తేలుస్తామని బెదిరించి పంపేశారు.
వెల్లంపల్లి దగ్గర జరిగిన లోకేశ్ పాదయాత్రలో సాక్షి విలేకరి మరొకరిపైనా టీడీపీ మూక దాడికి పాల్పడంది. పాదయాత్రలో జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న దళిత యువకులపై లోకేశ్ ప్రైవేటు సైన్యం దాడి చేసింది. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న నాగులుప్పలపాడు మండల ‘సాక్షి’ విలేకరి, దళిత సామాజికవర్గానికి చెందిన అత్తంటి మధుబాబుపై కూడా టీడీపీ మూక దాడికి పాల్పడింది. పది మంది చుట్టుముట్టి చేతిలో నుంచి సెల్‌ఫోన్ లాక్కొని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారు. మరోమారు ఇటువంటివి పునరావృతమైతే ప్రాణాలు ఉండవంటూ తీవ్రస్థాయిలో బెదిరించి పంపేశారు. విలేకరి మధును వదిలేసినా జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన దళిత యువకులను శుక్రవారం రాత్రికి కూడా వారి నిర్బంధంలోనే ఉన్నట్లు సమాచారం.
దాడి హేయమైన చర్య: దళిత సంఘాలు
ఏ తప్పూ చేయని దళిత విలేకరులపై లోకేశ్ గుండాలు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని దళిత సంఘాలు, జర్నలిస్టు సంఘాలు మండి పడుతున్నాయి. లోకేశ్ సిబ్బందిని అదుపులో పెట్టుకోకపోతే పాదయాత్ర సాగకుండా అడ్డుకుంటామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. దళిత విలేకరులు కరుణాకర్, మధుబాబుకు, వారి కుటుంబ సభ్యులకు లోకేశ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
‘సాక్షి’ రిపోర్టర్లపై దాడి దారుణం
‘సాక్షి’ విలేకరులు కరుణాకర్, మధుబాబుపై టీడీపీ గుండాల దాడి హేయమైన చర్య. ఒంగోలులో లోకేశ్ పాదయాత్రకు జనం నుంచి స్పందన లేదు. సాక్షి పత్రిక ఈ నిజాలను నిర్భయంగా రాస్తోంది. దీనిని జీర్ణించుకోలేక టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. సమాజంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకునే జర్నలిస్టులపై టీడీపీ గూండాల దాడి, సెల్‌ఫోన్లు లాక్కోవడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా గాయపడ్డ సాక్షి దళిత విలేకరి కరుణాకర్, ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment