సాక్షి, సిటీబ్యూరో: గంజాయిని న్యూస్ పేపర్‌లో దోస మాదిరిగా ప్యాక్ చేసి, ఆర్డర్ ఇచ్చిన వారికి డోర్ డెలివరీ చేస్తున్న మలక్‌పేట వాసి హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌కు (హెచ్–న్యూ) చిక్కాడు. ఇతడితో పాటు సహాయకుడిగా ఉన్న సమీప బంధువునీ పట్టుకున్న అధికారులు తదుపరి చర్యల నిమిత్తం కార్ఖానా పోలీసులకు అప్పగించారు. ఇతగాడికీ ఈ సరుకును సరఫరా చేసింది అదిలాబాద్‌కు చెందిన ముఠానే అని వెల్లడైంది. మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన కిషోర్ సింగ్ కొన్నేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అక్కడ ఇతడిపై నిఘా పెరగడంతో మకాంను మలక్‌పేటకు మార్చాడు.
అదిలాబాద్‌కు చెందిన సోనే రావు నుంచి గంజాయి ఖరీదు చేస్తున్నాడు. కేజీ రూ.10 వేలకు కొని, రిటైల్‌గా కేజీ రూ.60 వేలకు అమ్ముతున్నాడు. తన వద్దకు చేరిన గంజాయిని 100 గ్రాములు చొప్పున న్యూస్ పేపర్‌లో దోస మాదిరిగా ప్యాక్ చేస్తున్నాడు. కస్టమర్ల నుంచి ఆర్డర్ల కోసం ప్రత్యేక ఫోన్, నంబర్ వాడుతున్నాడు. ఈ ఆర్డర్ల ప్రకారం ద్విచక్ర వాహనంపై వెళ్లి డెలివరీ చేసి రావడానికి తన సమీప బంధువు ఇంద్ర కరణ్ సింగ్‌ను నియమించుకున్నాడు. ఈ ద్వయం కొన్నాళ్లుగా ఈ పంథాలో గుట్టుగా దందా చేస్తోంది.
చదవండి: రెండో భార్యతో ఉండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని..
వీరి వ్యవహారం ఇలా వెలుగులోకి...
హెచ్–న్యూ అధికారులు శనివారం సోనే రావుతో పాటు గంజాయి రవాణా చేసిన ఉల్లాస్, సుకారాం, హరిసింగ్‌లను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో తాము గంజాయిని బస్సులో తీసుకువస్తున్నామని చెప్పారు. అయితే వాటి సమయాలపై పొంతన లేని సమాధానం చెప్పడంతో హెచ్–న్యూ టీమ్ లోతుగా విచారించింది. దీంతో కారులో తెస్తున్నామని, అయితే ఆ రోజు ఉదయం తమ వాహనానికి మేడ్చెల్ వద్ద యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. నగరానికి వచ్చిన వెంటనే దాన్ని చాదర్‌ఘాట్‌లో మరమ్మతు చేయడానికి ఇచ్చామన్నారు.
అక్కడ నుంచి ఆటోలో కార్ఖానా వద్దకు డెలివరీ చేయడానికి చేరుకున్నామని, ఆ డ్రైవర్‌కు విషయం చెప్పలేదని బయటపెట్టారు. అప్రమత్తమైన అధికారులు ఆటోను గుర్తించి డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఆ రోజు తన ఆటో ఎక్కిన వీళ్లు మలక్‌పేటలో ఓ వ్యక్తికి బ్యాగ్ ఇచ్చారని చెప్పాడు. అలా ఆరా తీసిన హెచ్–న్యూ కిషోర్ సింగ్‌ను గుర్తించి పట్టుకున్నారు. ఇతడిచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రకరణ్‌ను పట్టుకున్నారు. వీరిద్దరినీ తదుపరి చర్యల నిమిత్తం కార్ఖానా పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment