హైదరాబాద్‌: ఉపాధి ఆశ చూపి వ్యభిచారంలోకి..!  | Hyderabad: Prostitution With Bangladesh Woman In The Name Job 6 Arrest | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: ఉపాధి ఆశ చూపి వ్యభిచారంలోకి..! 

Published Sat, Jul 23 2022 4:28 PM | Last Updated on Sat, Jul 23 2022 4:45 PM

Hyderabad: Prostitution With Bangladesh Woman In The Name Job 6 Arrest - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధి పేరుతో బంగ్లాదేశ్‌ యువతులను నగరానికి తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాలో ఆరుగురిని యాంటీ హ్యూమన్‌ ట్రాఫిక్‌ యూనిట్‌ స్పెషల్‌ ఆపరేషన్, ఉప్పల్‌ పోలీసులు, ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కారు, 7 సెల్‌ఫోన్స్, 5 సిమ్‌ కార్డులు, 7 నకిలీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. వ్యభిచార ముఠా నుంచి నుంచి ఓ బాలికతో పాటు మహిళను కాపాడారు. ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంప్‌ కార్యాలయంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం..


వివరాలు వెల్లడిస్తున్న సీపీ మహేష్‌ భగవత్‌  

జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన సతీష్‌ రజక్‌(25)  ముంబైలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. తను బంగ్లాదేశ్‌కు చెందిన బ్రిష్టిఖాతున్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అక్రమంగా పశ్చిమ బెంగాల్‌కు వచ్చి అక్కడ నకిలీ ఆధార్‌ కార్డు తీసుకుని ముంబైకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన దీపక్‌ చంద్, మావత్‌ ప్రకాష్‌(30), మహారాష్ట్రకు చెందిన సురేష్‌ బలుసోనన్నే(36,) అస్లాం చంద్‌ పటేల్, అరుణ్‌ రామచంద్ర జాదవ్‌(56), పశ్బిమ బెంగాల్‌కు చెందిన ప్రియాంక కలిసి  దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. 

దీపక్‌ చంద్, సతీష్‌ రజక్‌లు వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు, యువతులును ఉపాధి పేరుతో ఆకర్షించి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. ఆన్‌లైన్‌ డేటింగ్‌ వెబ్‌సైట్‌లో యువతులు, మహిళల అర్ధనగ్న ఫొటోలు అప్‌లోడ్‌ చేసి.. కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. దేశంలో క్లయింట్‌లకు కావాల్సిన చోటికి యువతులను పంపిస్తున్నారు. విమాన, రైలు, బస్సు, నెట్‌ బ్యాంకింగ్‌ యాప్స్‌ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ డబ్బు దండుకుంటున్నారు.

సతీష్‌ రజక్, భార్య బ్రిష్టిలు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ప్రాంతంలో ఉంటూ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను, బాలికలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.  బంగ్లాదేశ్‌ చెందిన ఓ మహిళ ఉద్యోగం కోసం తన బంధువైన  బ్రిష్టిని సంప్రదించగా ఇండియాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఆమె తన సోదరితో కలిసి అక్రమంగా జూన్‌ 27న బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కతాకు రాగా,  అక్కడ నుంచి రజక్, బ్రిష్టిలు ఉప్పల్‌ తీసుకొచ్చారు.  వారిద్దరినీ బలవంతంగా వ్యభిచారంలో దింపడంతో వారు ఈనెల 11న అక్కడి నుంచి తప్పించుకుని ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు ఈ ముఠాపై నిఘా పెట్టి ఆరుగురు నిందితులను అరెస్టు చేసి బంగ్లాదేశ్‌ మహిళలతో పాటు 15 ఏళ్ల బాలికను రక్షించారు. దీపక్‌ చంద్‌కు బంగ్లాదేశ్‌ మహిళలను అక్రమంగా రవాణా చేసేవారితో మంచి పరిచయాలు ఉన్నాయని, వారు మహిళలను అక్రమంగా భారత దేశ సరిహద్దులు దాటించి  పశ్బిమ బెంగాల్‌కు పంపుతారని, వారికి నకిలీ ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు తాను ఏర్పాటు చేస్తానని పోలీసుల విచారణలో సతీష్‌రజక్‌ కు తెలిపాడు. గత ఐదేళ్లుగా వీరు నగరంలోని సంపన్నులు నివాసం ఉండే ప్రాంతాల్లో బ్యూటీపార్లర్లు నిర్వహించేవారు. అమ్మాయిలను మసాజ్‌ గరల్స్‌గా ఏర్పాటు చేసి వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. 

మహిళలను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు, శిక్షలు అమలవుతాయని రాచకొండ సీపీ హెచ్చరించారు. పట్టుబడ్డవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.  ముఠాలోని  ప్రకాష్, ప్రియాంక పరారీలో ఉన్నారని, వీరిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో రాచకొండ  ఎస్‌ఓటీ డీసీపీ మురళీధర్,  ఏసీపీ వెంకన్న నాయక్, మాల్కాజిగిరి ఏసీపీ నరేష్‌రెడ్డి, ఏహెచ్‌టీయూ సీఐ నవీన్‌కుమార్, ఉప్పల్‌ సీఐ గోవింద్‌రెడ్డి, బాలకృష్ణ, సుధాకర్‌రెడ్డి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement