
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని హతమారుస్తున్న సీరియల్ కిల్లర్ రాములును రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సైకో కిల్లర్ 16 హత్యలు చేసినట్లు పోలీసులు నిర్థారించారు. 2011లో ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి పరారైన రాములు స్వగ్రామం సంగారెడ్డి జిల్లా కంది మండలం అరుట్ల కాగా, గతంలో రాములపై పలు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి పారిపోయి మళ్లీ హత్యలు చేస్తున్న సైకో కిల్లర్‌ను రాచకొండ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో పట్టుకున్నారు. నిందితుడిపై 16 హత్యలు, నాలుగు దోపిడీ, ఒక పోలీస్ కస్టడీ నుండి తప్పించుకున్న కేసులు ఉన్నాయి. చదవండి: ఈ దొంగ బాగా రిచ్, ఓ విల్లా.. 4 హైఎండ్ కార్లు
హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘‘చిన్న వయసులో పెళ్లి చేసుకున్న రాములు.. తన భార్య విడిపోవడంతో అప్పటి నుండి మహిళలపై కక్ష పెంచుకున్నాడు. మానసికంగా దెబ్బ తిన్న రాములు.. అప్పటి నుండి హత్యలకు పాల్పడుతున్నాడు. మొదట ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను హత్య చేశాడు. అతని చేతిలో హత్యకు గురైన వారందరు కూడా మహిళలే. మెదక్ జిల్లా తూప్రాన్, సంగారెడ్డి, నరసాపూర్, బోయినపల్లిలో ఇద్దరిని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 మంది మహిళలను హత్య చేశాడు. చదవండి: కిడ్నాప్ కలకలం.. ఆడ వేషంలో వచ్చి మరీ..
నార్సింగ్ మహిళ హత్య కేసులో అతనికి జీవిత కాలం శిక్ష పడింది. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి పోలీసులు తరలించగా, 2011లో అక్కడ నుంచి రాములు తప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా తీరు మార్చుకోని రాములు.. ఐదు దోపిడీలకు పాల్పడ్డాడు. 2013 లో అతనిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా, 2018 లో జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుండి విడుదలై వచ్చిన తరువాత వరుసగా రెండు హత్యలకు రాములు పాల్పడ్డాడని’’ సీపీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment