మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న కమీషనర్ అంజనీ కుమార్.. ఇన్‌సెట్‌లో రాములు (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: మొదటి భార్య వివాహమైన పక్షం రోజులకే మరొకరితో వెళ్లిపోయింది.. మూడేళ్లు కాపురం చేసిన రెండో భార్య విభేదాలు రావడంతో ఇద్దరు పిల్లల్ని తీసుకుని విడిపోయింది.. సహజీవనం చేసిన మూడో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటూ కంటపడింది... దీంతో 2003లో తూప్రాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ‘మూడో’ఆమెను హత్య చేశాడు. అప్పటి నుంచి భర్తలు ఉండి పెడదారిలో వెళ్తున్న మహిళల్ని ఎంపిక చేసుకుంటున్నమైన రాములు 18 మందిని చంపాడు. తాజాగా ఘట్‌కేసర్, ములుగు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇద్దరిని చంపిన ఈ సైకో సీరియల్ కిల్లర్‌ని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని కొత్వాల్ అంజనీకుమార్ వెల్లడించారు. ఓఎస్డీ పి.రాధా కిషన్‌రావుతో కలసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు.
సైకో కిల్లర్‌గా మారి హత్యలు..
సంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామానికి చెందిన రాములుకు తలారీ, సాయిలు అనే పేర్లూ ఉన్నాయి. వృత్తిరీత్యా స్టోర్ కటర్ అయిన ఇతను ప్రస్తుతం బోరబండలో నివసిస్తున్నాడు. ఇద్దరు భార్యలతో పాటు సహజీవనం చేసిన మహిళ ద్వారా ఎదురైన అనుభవాలతో సైకో కిల్లర్‌గా మారాడు. ఇటీవల మరో మహిళను వివాహం చేసుకుని ఆమెతో కలసి బోరబండలో నివసిస్తున్న రాములు.. భర్తలు ఉండి వారిని మోసం చేస్తూ వ్యభిచారం చేసే వారిని, డబ్బు కోసం పరాయి మగవాడికి లొంగిపోయిన వారిని ఎంచుకుని చంపుతుంటాడు. చదవండి: (మదనపల్లి జంటహత్యల కేసులో కొత్త ట్విస్ట్)
ప్రధానంగా కల్లు కాంపౌండ్లలో ఉన్న ఈ తరహా మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారితో కలసి కల్లు తాగే రాములు ఆపై డబ్బు ఆశ చూపి తన వెంట నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వారి పూర్వాపరాలు అడుగుతాడు. వారిలో ఎవరికైనా భర్తలున్నట్లు తేలితే... సైకోగా మారిపోయే రాములు వారిపై అత్యాచారం చేస్తాడు. ఆపై చీరతో ఉరి బిగించి లేదా బండ రాయితో మోది చంపేస్తాడు. కొన్నిసార్లు మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ముఖం తదితర భాగాలపై పెట్రోల్ పోసి కాల్చేస్తాడు. దీనికి ముందు మృతదేహంపై నుంచి చెవి కమ్మలు, కాళ్ల పట్టీలను తదితరాలు తస్కరిస్తాడు. ఏ ఆధారం వదలకుండా అక్కడ నుంచి జారుకుంటాడు.
పిచ్చిపట్టినట్లు నాటకం...
ఎనిమిది హత్యలు చేసిన ఇతడిని 2009, అక్టోబర్ 12న సైబరాబాద్ పోలీసులు తొలిసారిగా పట్టుకున్నారు. అప్పట్లో నార్సింగిలో జరిగిన హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. 2011లో మరో కేసులోనూ ఇలాంటి శిక్షే పడింది. దీంతో చర్లపల్లి కేంద్ర కారాగారంలో కొన్నాళ్లు శిక్ష అనుభవించాడు. అక్కడ నుంచి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో తనకు పిచ్చిపట్టినట్లు నాటకమాడాడు. దీంతో జైలు అధికారులు ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో చేర్చారు. 2011, డిసెంబర్ 29 రాత్రి రాములు అక్కడున్న ఇతర ఖైదీలు నర్సయ్య, అఫ్రోజ్ ఖాన్, గిరిజ సింగ్ వాఘేలా, యాదగిరి, లచ్చయ్యలతో కలసి పథకం వేసి తప్పించుకున్నాడు. దీనిపై ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ముగ్గురిని పోలీసులు అప్పట్లోనే పట్టుకోగా... రాములుతో పాటు లచ్చయ్య, అఫ్రోజ్ ఖాన్ కొన్నాళ్ల వరకు చిక్కలేదు. చదవండి: ('ఒకరోజు ఆగండి, మా పిల్లలు లేచి వస్తారు')
చోరీ కేసులు కూడా..
పారిపోయిన రాములు నగర శివారుల్లో ఉంటూ స్టోన్ క్రషర్స్‌లో కార్మికుడిగా పని చేశాడు. మళ్లీ సైకోగా మారి చందానగర్ ఠాణా పరిధిలో ఇద్దరు మహిళలను హత్యచేశాడు. రాములు పని చేస్తున్న క్రషర్‌లోనే మేతారీ బాలనర్సింహ్మ పరిచయమైంది. వీరిద్దరు దుండిగల్, బోయిన్‌పల్లి పరిధుల్లో మరో ముగ్గురు మహిళల్ని చంపేశారు. ఈ ఐదు హత్య కేసుల్లో రాములు, బాలనర్సింహ్మను పోలీసులు 2013, మే 13న అరెస్టు చేశారు. జీవితఖైదు పడిన కేసుల్ని హైకోర్టులో సవాల్ చేసి, మిగిలిన కేసుల్లో బెయిల్ పొందిన రాములు 2018 అక్టోబర్ 3న బయటకొచ్చి శామీర్‌పేట, పటాన్‌చెరు పరిధుల్లో ఇద్దరు మహిళలను హత్య చేశాడు. పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేయగా.. గతేడాది జూలై 31న జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడిపై శామీర్‌పేట, మేడ్చల్, రాయదుర్గం, ఐడీఏ బొల్లారం ఠాణాల్లో చోరీ కేసులు కూడా ఉన్నాయి.
సీసీ కెమెరాల ఆధారంగా..
గత ఏడాది డిసెంబర్ 10న బాలానగర్ కల్లు కాంపౌండ్ నుంచి ఓ మహిళను ములుగు ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెతో కలసి మద్యం తాగి హత్య చేశాడు. డిసెంబర్ 30న యూసుఫ్‌గూడ కల్లు కాంపౌండ్ నుంచి వెంకటమ్మను తీసుకువెళ్లి ఘట్‌కేసర్ వద్ద హత్య చేశాడు. వెంకటమ్మ హత్య కేసును ఛేదించడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఎస్సైలు కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్ తదితరులు సీసీ కెమెరాల ఫీడ్‌లో చిక్కిన ఫీడ్ ఆధారంగా రాములును పట్టుకున్నారు. ములుగులో హత్యకు గురైన మహిళను గుర్తించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment