‘మేత’వన్నె పులి | Import of drugs worth thousands of crores from brazil | Sakshi
Sakshi News home page

‘మేత’వన్నె పులి

Published Sun, Mar 24 2024 2:59 AM | Last Updated on Sun, Mar 24 2024 2:59 AM

Import of drugs worth thousands of crores from brazil - Sakshi

‘సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌’ ఆగడాలెన్నో.. 

గతంలోనే అప్సడా కొరడా 

రొయ్యల మేతలో ‘డ్రై ఈస్ట్‌’ వాడకం తక్కువే 

దేశంలోనే ఉత్పత్తి కంపెనీలకు కొదవలేదు 

తక్కువ ధరకు వస్తుందనే విదేశాల నుంచి దిగుమతి 

ఎక్కువగా ఉపయోగించేది బేకరీ, ఆహార ఉత్పత్తుల్లోనే 

కొద్ది నెలల క్రితమే ఫీడ్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ 

ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం తక్కువే అయినా 25 టన్నులు దిగుమతి  

ఇంత పెద్దమొత్తంలో అవసరమేమిటో అర్థం కాని ప్రశ్న  

ఇది టీడీపీ, బీజేపీ సమేత డ్రగ్స్‌ కథా చిత్రమే! 

సాక్షి, అమరావతి: డ్రై ఈస్ట్‌ మాటున రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను బ్రెజిల్‌ నుంచి సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ పేరిట దిగుమతి చేసుకున్న ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. రొయ్యల మేత మాటున రూ.లక్షల కోట్ల డ్రగ్స్‌ దందా సాగిస్తూ ‘మేత’వన్నె పులిగా ‘సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌’ ఖ్యాతిపొందింది. ఈ క్రమంలో అసలు డ్రై ఈస్ట్‌ అంటే ఏమిటి? ఎలా తయారవుతుంది.? ఏయే అవసరాల కోసం  ఎంత మోతాదులో వినియోగిస్తారు. ఆక్వా ఫీడ్‌ తయారీలో నిజంగానే వాడతారా? ఫీడ్‌ తయారీలో ఈ సంస్థ ఎప్పుడు అడుగు పెట్టింది ?  ప్లాంట్‌ సామర్థ్యం ఎంత ? ఎందుకు ఇంత పెద్దమొత్తంలో ఆర్డర్‌ ఇవ్వాల్సి వచ్చింది? అనే  అంశాలపై చర్చ జరుగుతోంది 

90 శాతానికిపైగా ఆహార ఉత్పత్తుల తయారీలోనే 
డ్రై ఈస్ట్‌ అనేది సజీవ సూక్ష్మజీవుల సమాహారం. ఇదొక ఇమినో బూస్టర్‌లా ఉపయోగపడుతుంది. శిలీంధ్రాల జాతికి చెందిన దీని శాస్త్రీయ నామం సక్కరో మైసెస్‌. ప్రధానంగా యాక్టివ్‌ డ్రై ఈస్ట్, ఇన్‌స్టంట్‌ డ్రై ఈస్ట్, ఫాస్ట్‌ యాక్టింగ్‌ ఇన్‌స్టంట్‌ ఈస్ట్, బ్రెడ్‌ మెషిన్‌ ఈస్ట్‌ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా బేకరీ, ఆహార ఉత్పత్తుల తయారీలో వాటి ఆకృతి, రుచి, పెరుగుదలకు వాడుతుంటారు. ఆక్వా, పౌల్ట్రీ, యానిమల్‌ ఫీడ్‌ తయారీలోనూ కొద్దిగా వాడతారు.

ఈస్ట్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలు దేశీయంగా చాలా ఉన్నాయి. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం, విదేశాలతో పోల్చుకుంటే ధర ఎక్కువగా ఉండడంతో మెజార్టీ ఆహార ఉత్పత్తుల తయారీదారులు విదేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంటారు. బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ, చైనాలో ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. దేశీయంగా క్వాలిటీని బట్టి కిలో రూ.200 నుంచి రూ.480 వరకు ఉంటే, ఒక్క బ్రెజిల్‌లోనే కిలో రూ.70కు అందుబాటులో ఉంటుంది.

కారణం ఇక్కడ ఎక్కువగా పండే బార్లీ నుంచి ఈస్ట్‌ ఉత్పత్తి చేసే కంపెనీలు ఎక్కువగా ఉండడమే. అందుకే ఒక్క బ్రెజిల్‌ నుంచి ఏటా 500 టన్నుల ఈస్ట్‌ మన దేశానికి దిగుమతి అవుతుంది. దిగుమతి అయ్యే డ్రై ఈస్ట్‌లో నూటికి 90 శాతానికి పైగా ఆహార ఉత్పత్తుల తయారీలోనే ఉపయోగిస్తారు. ఆక్వా, పౌల్ట్రీ, యానిమల్‌ ఫీడ్‌ తయారీలో వాడకం ఐదు శాతం లోపే ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువగా ఫీడ్‌ సప్లిమెంట్‌ కోసం వాడతారు. 

ఆక్వా సాగులోనూ హెక్టారుకు 5 గ్రాములకు మించి వాడరు 
ఆక్వాసాగులో ఈస్ట్‌ను రైతులు ఉపయోగిస్తుంటారు. సాగుకు ముందు చెరువులను సిద్ధం చేసే సమయంలో వాటర్‌ ఫ్యూరిఫికేషన్‌ చేస్తారు. ఈ సమయంలో వరిపిండి, తవుడు, బెల్లం, నీరు కలిపిన ద్రావణంలో 1–2 గ్రాములు ఈస్ట్‌ను కలిపి 24 గంటలపాటు పులియబెట్టి ఆ తర్వాత చెరువులో కలుపుతారు. దీనివల్ల పైటో ప్లాంటన్‌ (వృక్ష సంబంధమైన ప్లవకం), జూ ప్లాంటన్‌ (జంతు సంబంధమైన ప్లవకం) తయారవు తుంది. వీటిని తినేందుకు రొయ్యలు ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. ఇలా హెక్టార్‌కు ఐదు గ్రాములకు మించి వినియోగించరు.

ఆ తర్వాత వ్యాధికారక క్రిములను తట్టుకొని మెరుగైన రోగనిరోధకశక్తిని పొందేందుకు, నీటి నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రో బయోటిక్స్‌గానూ వాడుతుంటారు. వీటి తయారీలో కూడా ఈస్ట్‌ను ఫీడ్‌ కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. రొయ్యల మేత తయారు చేసే ఫీడ్‌ కంపెనీలు దేశీయంగా 16 ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 14 లక్షల టన్నుల మేత ఉత్పత్తి జరుగుతుంది. ఒక్క అవంతి ఫీడ్‌ కంపెనీయే ఏటా 5–6 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత సీపీఎఫ్‌ కంపెనీ 2 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంటే, మిగిలిన కంపెనీలన్నీ ఏటా 50 వేల నుంచి లక్ష టన్నులలోపు ఉత్పత్తి చేస్తుంటాయి. 

ఏకంగా 25 టన్నులెందుకు? 
ఇక సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెట్‌ పేరిట అధికారికంగా పామర్రులో రెండు ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండగా, నెల్లూరులో బ్లాక్‌వాటర్‌ షల్‌ ఫిష్‌ హేచరీ ఉంది. రెండు నెలల క్రితం కాకినాడ జిల్లా మూలపేట వద్ద మరో ప్రాసెసింగ్‌ ప్లాంట్, వజ్రకూటం వద్ద ఏటా 60వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్వా ఫీడ్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఒక్క కిలో కూడా మార్కెట్‌లోకి రాలేదు. కేజీ మేత తయారీ కోసం కేవలం 5 గ్రాములకు మించి డ్రై ఈస్ట్‌ను వాడరు.

అంటే 25 టన్నుల డ్రై ఈస్ట్‌ ద్వారా కనీసం 5 లక్షల నుంచి 6 లక్షల టన్నుల మేత తయారు చేయొచ్చు. ఈ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 60 వేల టన్నులు మాత్రమే. ఈ లెక్కన ఇంత పెద్ద ఎత్తున డ్రైడ్‌ ఈస్ట్‌ దిగుమతికి ఆర్డర్‌ ఇవ్వడం వెనుక చాలా గూడుపుఠాణి ఉందని అర్థమవుతోంది. టీడీపీ, బీజేపీ పెద్దల సహకారంతోనే డ్రై ఈస్ట్‌ పేరిట డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. 

రైతులకు రూ.కోట్లలో బకాయిలు
మరోవైపు సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్‌ సంస్థ రోజుకు 80 టన్నుల నుంచి 150 టన్నుల రొయ్యలను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు ఉన్న ఆక్వా రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది. వీటిని ప్రాసెస్‌ చేసి అమెరికా, చైనాకు ఎగుమతి చేస్తుంది. గతంలో ఎక్స్‌పోర్ట్‌ కంపెనీలు చెప్పిందే ధర.. ఇచ్చిందే సొమ్ము అన్నట్టుగా ఉండేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అప్సడా చట్టం చేయడం, పైగా కౌంట్‌ల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ప్రాసెసింగ్‌ కంపెనీలు కొనుగోలు చేసేలా ప్రతి 15రోజులకోసారి పర్యవేక్షిస్తుండడంతో కంపెనీల ఆటలు సాగడం లేదు.

స్థానిక ఆక్వా రైతులను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈక్వెడార్‌ నుంచి 17 కంటైనర్లలో రొయ్యలను దిగుమతి చేసుకొని వాటిని ప్రాసెస్‌ చేసి తిరిగి అమెరికా, చైనాకు ఎగుమతి చేస్తున్నారని తెలియడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కంపెనీని కొంతకాలం పాటు సీజ్‌ చేసింది. ఎగుమతులకూ బ్రేకులేసింది. ఇటీవల కాలంలో ఈ సంస్థ రైతులకు రూ.కోట్లలో బకాయి పడింది. రొయ్యలు సరఫరా చేసినందుకు ఈ కంపెనీ తనకు రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉందని భీమవరానికి చెందిన ఓ రైతు ‘సాక్షి’కి తెలిపారు. ఈ విధంగా సుమారు రూ.10 కోట్లకు పైగా ఈ సంస్థ రైతులకు చెల్లించాల్సి ఉందని సమాచారం.  

బకాయిలు చెల్లించేలా చూడాలి 
సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ వ్యవహా­రం ఆది నుంచి వివా­దాస్పదమే. ఈక్వె­డార్‌ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలను ప్రాసెస్‌ చేసి అమెరికాకు పంపుతున్న సమయంలో అప్సడా ఉక్కుపాదం మోపింది. చట్టపరంగా చర్యలు తీసుకుని కంపెనీని చాన్నాళ్లు మూసేసింది. ఇటీవల ప్రారంభించిన ఫీడ్‌ ప్లాంట్‌ తయారీకి ఎలాంటి అనుమతులూ లేవని చెబుతున్నారు.

ఉత్పత్తిని పూర్తిస్థాయిలో ప్రారంభించని ఈ సంస్థకు  ఇంతపెద్ద ఎత్తున డ్రై ఈస్ట్‌ దిగుమతి చేసుకోవల్సిన అవసరం ఏముంది? ఏదేమైనా ముందుగా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు అణాపైసలతో సహా చెల్లించి తీరా­ల్సిందే. ఈ సంస్థను అడ్డంపెట్టుకుని డ్రై ఈస్ట్‌ మాటున డ్రగ్స్‌ రాకెట్‌ నడుపుతున్న టీడీపీ, బీజేపీ పెద్దలెవరో తెలియాలంటే సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి.  – వడ్డి రఘురాం, కో–వైస్‌ చైర్మన్, అప్సడా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement