
సాక్షి, యానాం: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ బహిష్కృత నేత అదృశ్యం కలకలం రేపుతోంది. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పెమ్మాడి దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యారు. తన భర్త గురువారం ఉదయం నుంచి కనిపించట్లేదని ఆయన భార్య పెమ్మాడి శాంతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఉదయం ఎన్నికల ప్రచారం కోసం వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదని అంతేకాకుండా మొబైల్ ఫోన్ స్విచాఫ్‌లో ఉన్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా, యానాం కొత్తపేటకు చెందిన పెమ్మాడి దుర్గా ప్రసాద్.. మత్స్య వ్యాపారి. ఆయనకు సొంతంగా ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. తన సామాజిక వర్గంలో మంచి పట్టు ఉండడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈనెల 6న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దుర్గా ప్రసాద్ అదృశ్యం సంచలనం రేకిత్తిస్తుంది.