‘రాప్తాడు’లో పరువు హత్య | Inter-caste marriage Dignity Assassination Rapthadu | Sakshi
Sakshi News home page

‘రాప్తాడు’లో పరువు హత్య

Published Sat, Jun 18 2022 6:06 AM | Last Updated on Sat, Jun 18 2022 6:06 AM

Inter-caste marriage Dignity Assassination Rapthadu - Sakshi

హతుడు చిట్రా మురళి, అతని భార్య వీణ (ఫైల్‌)

రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరువు హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని భార్య తరఫువారు గొంతుకోసి చంపేశారు. బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి ప్రాణాలు తీశారు. తన తల్లి ఈ హత్య చేయించిందని హతుడు చిట్రా మురళి (27) భార్య వీణ ఆరోపిస్తోంది. పోలీసులు, వీణ కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన కురుబ చిట్రా నాగన్న, ముత్యాలమ్మ దంపతుల ఏకైక కుమారుడు చిట్రా మురళి, అదే గ్రామానికి చెందిన ములుగూరు రామానాయుడు (లేట్‌), యశోదమ్మల ఏకైక కుమారై వీణ పదోతరగతి వరకు కలిసి చదువుకున్నారు.

మురళి డిగ్రీ, వీణ బీటెక్‌ పూర్తిచేశారు. ప్రస్తుతం మురళి పెనుకొండ సమీపంలోని కియా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వీణ కనగానపల్లి మండలం ఎలక్కుంట్ల గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్‌గా పనిచేస్తున్నారు. పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్న వీరి పెళ్లికి కులాలు వేరుకావడంతో ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి గతేడాది జూన్‌ 23న ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. 4 నెలలు అనంతపురంలో తలదాచుకున్నారు. తర్వాత రాప్తాడు ఎస్సీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. అక్కడి నుంచే విధులకు వెళ్లసాగారు.  

కిడ్నాప్‌ చేసి హత్య  
మురళి ఉద్యోగానికి వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటినుంచి ద్విచక్ర వాహనం మీద బయలుదేరాడు. ఆ వాహనాన్ని రాప్తాడులోని 44వ నంబరు జాతీయ రహదారి పక్కనున్న పెట్రోలు బంకులో పార్కుచేసి, కంపెనీ బస్సు కోసం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో వేచి ఉన్నాడు. అంతలోనే ఆటోలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు అతడిని బలవంతంగా ఎక్కించుకున్నారు.

రాప్తాడు నుంచి లింగనపల్లి రోడ్డు మీదుగా బొమ్మేపర్తి పొలాల్లోకి తీసుకెళ్లి గొంతుకొసి హత్యచేశారు. శుక్రవారం ఉదయం ఆ పొలాల్లోకి క్రికెట్‌ ఆడేందుకు వెళ్లిన యువకులు మృతదేహాన్ని చూసి 100కు డయల్‌ చేసి సమాచారమిచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, వీణ తల్లి యశోదమ్మను, పెదనాన్న, పెద్దమ్మ, ఇద్దరు బాబాయిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

మా అమ్మే చంపించింది 
మా పెళ్లికి మా అమ్మ యశోదమ్మ ఒప్పుకోలేదు. పెళ్లయిన తర్వాత కూడా మమ్మల్ని పలుమార్లు బెదిరించింది. ‘నాకు మొగుడు లేడు.. నీకూ లేకుండా చేస్తా’ అనేది. అన్నట్లుగానే నా భర్తను హత్య చేయించింది.      
– వీణ, హతుడి భార్య 

యశోదమ్మే హత్య చేయించింది 
నా కొడుకును యశోదమ్మే హత్య చేయించింది. నా బిడ్డను వదిలి పెట్టకపోతే నీ కొడుకును హత్య చేయిస్తానని పలుమార్లు మా ఇంటి దగ్గరకు వచ్చి బెదిరించింది. ఇప్పుడు అనుకున్నట్టే చేసింది. ఒక్కగానొక్క కొడుకును పొట్టనబెట్టుకుంది. ఇక మేమెలా బతకాలి? 
– ముత్యాలమ్మ, హతుడి తల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement