వంశీకృష్ణ (ఫైల్), విలపిస్తున్న తల్లి సువర్ణ
గచ్చిబౌలి: ‘లైంగిక వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నాను.. అమ్మా.. నాన్నా నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన కలకలం రేపింది. గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ గ్రామానికి చెందిన లింగారం లక్ష్మణ్ గౌడ్, సువర్ణల రెండో కుమారుడు వంశీకృష్ణ (17) నగరంలోని గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ బైపీసీ చదువుతున్నాడు. కోవిడ్‌తో మూతపడిన కళాశాల ఈ నెల 2న పునఃప్రారంభమైంది. జనవరి 31న ఇంటి నుంచి వెళ్లిన వంశీకృష్ణ 2న కళాశాలలో చేరాడు.
శుక్రవారం రాత్రి 10 గంటలకు వసతి గృహంలో తోటి విద్యార్థులతో కలిసి నిద్రకు ఉపక్రమించాడు. అప్పటికే స్నేహితుని వాచ్ తీసుకొని రాత్రి 12.30 గంటలకు అలారం పెట్టించుకున్నాడు. ఉదయం 5 గంటలకు వ్యాయామ డ్రిల్‌కు వంశీ గైర్హాజరయ్యాడు. దీంతో ఉదయం 6.30 గంటలకు వెతకగా క్లాస్ రూమ్ వెనక నుంచి గడియ ఉండటం గమనించి తలుపులను గట్టిగా తోసి చూడగా.. పైకప్పు కొక్కేనికి చున్నీతో ఉరి వేసుకొని వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కళాశాల ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
లైంగిక దాడి జరిగిందంటూ..
వంశీకృష్ణ బ్యాగ్‌లో రెండు సూసైడ్ నోట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘పూజ్యులైన నాన్న, అమ్మకు క్షమాపణలు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేకపోతున్నాను. నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. నా బాధ మీతోగాని, స్నేహితులతో గాని, టీచర్లతోగాని పంచుకోలేను. మనస్తాపానికి, ఒత్తిడికి గురవుతున్నాను. బాధను భరించలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నా క్షమించాలి’ అని సూసైడ్ నోట్‌ను ఇంగ్లిష్, తెలుగులో భాషల్లో రాశాడని సీఐ సురేష్ తెలిపారు. ‘ఓ దేవుడా నిన్ను మణులు, మాణిక్యాలు అడిగానా, పెద్ద ఉద్యోగం అడిగానా, చిన్న కోరికను తీర్చలేకపోతున్నావు’ అంటూ మరో లేక రాశాడని, ఐయామ్ సఫరింగ్ ఫ్రమ్ బ్లడ్ క్యాన్సర్’ అంటూ మరో చోట రాశాడని పోలీసులు తెలిపారు. లైంగిక దాడి కోణంలోనూ విచారణ చేస్తామని, సూసైడ్ నోట్‌లు వంశీ కృష్ణ రాశాడా లేదా అనేది తేలాల్సి ఉందన్నారు.
కళాశాల ఎదుట ఆందోళన..
మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదని శనివారం ఉదయం 6 గంటలకు కాలేజీ నుంచి ఫోన్ వచ్చిందని.. ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడని చెప్పినట్లు వంశీకృష్ణ తండ్రి లక్ష్మణ్‌గౌడ్ రోదిస్తూ తెలిపారు. హాస్టల్‌లో నిద్రించిన విద్యార్థి దూరంలో ఉన్న క్లాస్ రూమ్‌కు వెళ్లి సూసైడ్ చేసుకుంటే అక్కడున్న సిబ్బంది ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మృతదేహాన్ని తాము రాకముందే తరలించాల్సిన అవసరం ఏముందని, ఆత్మహత్యగల కారణాలు వెల్లడించాలని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. వంశీ కృష్ణ చదువులో చురుగ్గా ఉండేవాడని.. అందరూ నిద్రలో ఉండగా క్లాస్‌రూమ్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రిన్సిపాల్ సత్యనారాయణ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment