
బనశంకరి: ఫేస్‌బుక్‌లో ప్రకటనను నమ్మి ఓ మహిళ రూ.50 వేలు పోగొట్టుకున్న ఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. కనకపుర రోడ్డు యలచేనహళ్లి నివాసి సవితాశర్మా మంగళవారం ఫేస్‌బుక్‌లో రూ.250 విలువ చేసే ఒక దాలి ఆర్డర్ చేస్తే రెండు దాలి ఉచితంగా ఇస్తామని ప్రకటన గమనించింది. భోజనం ఆర్డర్ చేయడానికి ప్రకటనలో నమోదుచేసిన నెంబరుకు ఫోన్ చేసింది. ఈ క్రమంలో ఆర్డర్ చేయడానికి ముందు రూ.10 చెల్లించాలని, అనంతరం భోజనం ఇంటికి సరఫరా చేసిన అనంతరం మిగిలిన నగదు చెల్లించవచ్చునని అవతలి వ్యక్తి తెలిపాడు. అనంతరం ఫారం భర్తీ చేయాలని సవితాశర్మా మొబైల్‌కు లింక్ పంపించాడు.(చదవండి: చెల్లి కోసం తల్లిని చంపిన తనయుడు)
ఈ ఫారంలో ఆమె డెబిట్‌కార్డు వివరాలు, పిన్ నెంబరును నమోదుచేసింది. తక్షణం కొద్దిక్షణాల్లో రూ.49,996 నగదు ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లు సవితాశర్మా మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో గాబరాబడిన బాధితురాలు అదే నెంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అయినట్లు తెలిసింది. మరుసటిరోజు ఆమె సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఫేస్‌బుక్ ప్రకటన కలిగిన రెస్టారెంట్ అడ్రస్ సదాశివనగర అని తెలిసింది. సాధ్యమైనంత త్వరగా వంచకుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.