గుంతకల్లు: తెలుగు రాష్ట్రాల్లో ఓ ముఠా కొంతకాలంగా కిడ్నాప్‌లతో హల్‌చల్ చేస్తోంది. స్థానిక యువతను ముఠాలో చేర్చుకోవడం, వారికి సమాచారం, సహకారం అందించడం, కిడ్నాప్‌లు, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ఈ ముఠా లక్ష్యం. దీనికి నాయకుడు సుంకర ప్రసాద్‌నాయుడు.
ఎవరీ సుంకర ప్రసాద్?
ప్రసాద్ సొంతూరు ప్రకాశం జిల్లా గిద్దలూరు. క్రిమినల్ చరిత్ర చాలా పెద్దది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఏకంగా 33 హత్య కేసుల్లో నిందితుడు. జైళ్లు, పోలీసులు, కేసులంటే లెక్కలేదు ఇతనికి. తాను చేసిన హత్యల గురించి ఒక్కొక్కటిగా విడమరిచి మరీ మీడియాకు వెల్లడించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇతని భార్య ఓ మాజీ నక్సలైట్. ప్రసాద్‌కు సుమారు రెండు దశాబ్దాల క్రిమినల్ చరిత్ర ఉంది. ఇంతటి నేర చరిత్ర కల్గిన ఇతని కన్ను ఇటీవల గుంతకల్లు ప్రాంతంపై పడింది.
గుంతకల్లు వాసులతో కలసి..
ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు, నలుగురు వ్యక్తులతో సుంకర ప్రసాద్ జతకట్టాడు. వీరిలో ముఖ్యుడు జి.కొట్టాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి. అతను ఇచ్చిన సమాచారం మేరకు జి.కొట్టాలకు చెందిన ఓ స్వామీజీని గత నెల 29న కిడ్నాప్ చేశారు. ఆయన నుంచి రూ.26 లక్షల వరకు దండుకున్నట్లు సమాచారం. ఇందులో రూ.10 లక్షలు వాటాగా జి.కొట్టాలకు చెందిన వ్యక్తికి ఇచ్చినట్లు సమాచారం.
ఈ దందా బాగుందని భావించిన జి.కొట్టాల వాసి తన గ్రామానికే చెందిన ఆకుల వ్యాపారి వెంకటేష్ వివరాలను సుంకర ప్రసాద్ ముఠాకు చేరవేశాడు. దీంతో సుంకర ప్రసాద్ ముఠా ఈ నెల 20న ఆకుల వ్యాపారిని కిడ్నాప్ చేసింది. అతని కుమారుడు సాయికుమార్‌కు ఫోన్‌చేసి రూ.40 లక్షలు డిమాండ్ చేసింది. సాయంత్రంలోగా సమకూర్చకపోతే వెంకటేష్‌ను చంపుతామని బెదిరించింది. బెంబేలెత్తిన అతను గ్రామస్తుల సహకారంతో పోలీసులను ఆశ్రయించాడు.
ఇంటర్వ్యూలు చూసి..
ఇక సుంకర ప్రసాద్ ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో చూసి జి.కొట్టాలకు చెందిన వ్యక్తి అతన్ని సంప్రదించినట్లు తెలిసింది. జల్సాలకు అలవాటు పడిన ఆ వ్యక్తికి అప్పులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సుంకర ప్రసాద్ సహకారంతో తొలుత స్వామీజీని కిడ్నాప్‌చేసి విజయవంతమయ్యారు. ఇదే క్రమంలో రెండో కిడ్నాప్‌కు యత్నించి పోలీసులకు దొరికిపోయారు.
ముఠా ఆటకట్టు ఇలా..
పోలీసుల సూచన మేరకు కిడ్నాపర్లకు సాయికుమార్ ఫోన్‌చేసి డబ్బులు సిద్ధం చేశానని, తమ గ్రామానికి వచ్చి తీసుకువెళ్లాలని కోరాడు. దీంతో గ్రామానికి చేరుకున్న కిడ్నాపర్లు ఒక కారు ఏర్పాటుచేశామని, అందులో డబ్బు పెట్టాలని సాయికుమార్‌కు చెప్పారు. అదే సమయంలో పోలీసులను గమనించిన కిడ్నాపర్లు కారు వదిలేసి పరారయ్యారు. అయితే.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ వద్ద వెంకటేష్‌ను కిడ్నాపర్ల చెర నుంచి విడుదల చేయించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో జి.కొట్టాల వాసితోపాటు సుంకర ప్రసాద్, మరో ముగ్గురు ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment