
చంఢీఘడ్ : జీతం పెంచలేదని, నలుగురి ముందు అవమానించాడన్న కోపంతో దొంగతనం నాటకం ఆడి యజమానిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి. అయితే నాటకం రక్తికట్టక చివరకు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫరీదాబాద్‌కు చెందిన దీక్షిత్ అనే వ్యక్తి అక్కడి ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. అయితే అతడి యజమాని జీతం పెంచకపోగా కొన్నిరోజుల క్రితం దీక్షిత్‌ను నలుగురి ముందు అవమానించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతడు యజమానిపై పగతో రగిలిపోయాడు. ఎలాగైనా అతడ్ని దెబ్బతీయాలని నిర్ణయించకున్నాడు. ( ఆన్‌లైన్‌లో శృంగారం పేరుతో..)
ఓ రోజు యజమాని కంపెనీకి చెందిన 10 లక్షల రూపాయల డబ్బులు తీసుకువచ్చే పనిని దీక్షిత్‌కు అప్పజెప్పాడు. ఇదే సరైన సమయం అని భావించిన అతడు దొంగతనం నాటకానికి తెర తీశాడు. డబ్బులు తీసుకువస్తూ ఉండగా ఇద్దరు దొంగలు తనను దోచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ సందర్భంగా దీక్షిత్ గడియకో మాట మాట్లాడుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గట్టిగా విచారించటంతో దీక్షిత్ నేరం ఒప్పుకున్నాడు.