
వికాస్ (ఫైల్)
ఈ లోకానికి పరిచయం చేసినప్పుడు బోసినవ్వులతో మురిసిపోతిని.. బుడిబుడి అడుగులు వేయించినప్పుడు నువ్వున్నావన్న ధైర్యంతో ముందుకు నడిస్తిని.. గుండెల్లో దాచుకుంటావని, బంగారు భవితకు బాటలు వేస్తావని ఆశపడితిని.. అదే ధైర్యంతో, అదే అశతో ఇంటి నుంచి నీ వెంటే బయటకొస్తిని.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. నిర్జీవంగా మారుస్తావని కలలోనూ ఊహించలేదు.. నాన్నా..నేనేం తప్పు చేశాను?. నన్నెందుకిలా చేశావు?!
పెనుకొండ రూరల్(శ్రీ సత్యసాయి జిల్లా): భార్యపై అనుమానంతో కన్న కొడుకును దారుణంగా హత్య చేశాడో కసాయి. ఈ ఘటన పెనుకొండ మండలంలో మంగళవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ రమేష్‌బాబు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలం శివపురం గ్రామానికి చెందిన కవిత, గంగరాజు భార్యాభర్తలు. వీరికి ఒకటిన్నర సంవత్సరం వయసున్న వికాస్ అనే కుమారుడు ఉన్నాడు. గంగరాజు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నెల 20వ తేదీ కూడా గొడవ పడ్డారు.
గంగరాజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కుమారుడు వికాస్‌ను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. తిరిగి వెళ్లలేదు. దీంతో కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు సాగిస్తుండగానే.. గంగరాజు తన అన్నకు తారసపడ్డాడు. కుమారుణ్ని ఏమి చేశావని అతను ప్రశ్నించగా..ఎప్పుడో చంపేసినట్లు చెప్పాడు. దీంతో అతను కవితకు సమాచారమిచ్చాడు.
చదవండి: నన్ను పెళ్లి చేసుకో.. లేదా పురుగు మందు తాగు..
ఆమె పోలీసులకు తెలపడంతో గంగరాజును మడకశిరలో అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారణ చేశారు. కుమారుణ్ని పెనుకొండ మండల పరిధిలోని 44వ జాతీయ రహదారి సమీపాన గల ఉలవలకుంట గుట్ట వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా చిన్నారి మృతదేహం లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో కన్పించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అభం శుభం తెలియని చిన్నారిని చంపేందుకు చేతులెలా వచ్చాయంటూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment