మృతి చెందిన వెంకటరమణ - నిందితుడు ఇలియాజ్ - స్వాధీనం చేసుకున్న బైక్
అనంతపురం క్రైం: కుర్రాళ్ల బైక్ విన్యాసం ఒక నిండుప్రాణాన్ని బలితీసుకుంది. అత్యంత రద్దీ కలిగిన ప్రదేశంలో మితిమీరిన వేగంతో వెళ్తూ నిల్చున్న వ్యక్తిని ఢీకొనడంతో అతడు గాలిలో ఎగిరి రోడ్డుపై పడి ప్రాణం విడిచాడు. వివరాల్లోకెళ్తే... అనంతపురంలోని వినాయకనగర్‌కు చెందిన పి.వెంకటరమణ (50) జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సప్తగిరి సర్కిల్ సమీపంలో ద్విచక్రవాహనం ఆపి అటువైపు వెళ్లేందుకు అనకొండ షోరూం వద్ద నిల్చుని ఉన్నాడు. ఇంతలో టవర్‌క్లాక్ వైపు నుంచి మున్నానగర్‌కు చెందిన ఇలియాజ్ మరో యువకుడు కలిసి స్పోర్ట్స్ బైక్‌పై విన్యాసాలు చేసుకుంటూ పెద్ద పెద్ద శబ్దంతో హారన్ కొడుతూ దూసుకొచ్చారు. వేగాన్ని అదుపుచేసుకోలేక వెంకటరమణను ఢీకొనడంతో అతను ఎగిరి రోడ్డుపై పడ్డాడు. రోడ్డుకు బలంగా తగలడంతో తల, ముక్కు, చెవుల్లోంచి రక్తస్రావమైంది. అదుపుతప్పిన యువకులు అలాగే ముందుకెళ్లి ఒక ఆటోను ఢీకొని కిందపడ్డారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వెంకటరమణను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. వెంకటరమణకు భార్య లక్షి్మ, నలుగురు పిల్లలు ఉన్నారు.
నిందితుడికి దేహశుద్ధి
మితిమీరిన వేగంతో ఢీకొని నిండుప్రాణాన్ని బలిగొన్న మున్నానగర్‌కు చెందిన ఇలియాజ్, మరో యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చేలోపు ఓ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్వల్పంగా గాయపడిన ఇలియాజ్‌ను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment