కారోబార్ జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం
సాక్షి, మంగపేట: మండలంలోని రాజుపేట పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని కారోబార్ ఫోర్జరీ చేసి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. రాజుపేట పంచాయతీ సెక్రటరీ మానస 2020 జూలై 4 నుంచి 15 రోజుల పాటు సెలవులో ఉండగా కారోబార్ గడ్డిపాటి మహేష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి రాజుపేట పంచాయతీ పరిధిలోని ముప్పనేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి జులై 29న మృతి చెందినట్లు ధ్రువీకరిస్తూ మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశాడు. తన విధులను తప్పుదోవ పట్టించిన ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అదే కారోబార్ గ్రామంలో కోర్టు వివాదంలో ఉన్న ఖాళీ స్థలానికి ఇంటి యజమానిగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేశాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
గ్రామంలో ఖాళీ స్థలాల్లో ఇల్లు ఉన్నట్లుగా తప్పుడు ఇంటి నంబర్లు ఇచ్చి దొంగ రిజిస్ట్రేషన్లకు సహకరించాడనే అభియోగాలు ఉన్నాయి. దీంతో కోర్టు వివాదంలో ఉన్న ఖాళీ స్థలాలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు ఉన్నట్లుగా ఇంటి యజమాని పత్రాలు జారీ చేసి దొంగ రిజిస్ట్రేషన్లకు సహకరిస్తున్న కారోబార్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లా పంచాయతీ అధికారులు సైతం కారోబార్ నుంచి రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. విషయంపై ఎంపీఓ శ్రీకాంత్ నాయుడిని వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది వాస్తమేనన్నారు. ఆయనపై ఖాళీ స్థలాలకు ఇంటి యజమాని ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన విషయంపై ఫిర్యాదు కూడా అందిందన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment