వివరాలు వెల్లడిస్తున్న సీపీ తరుణ్‌జోషి
వరంగల్‌క్రైం: షేర్ మార్కెట్ అంటూ నకిలీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన కిలాడీ దంపతులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారినుంచి రూ.2.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్, స్వైపింగ్ మిషనర్, 8 సెల్‌ఫోన్లు, చెక్‌బుక్‌లు, బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు, స్టాంపులు, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గోగుల శ్రీనివాస్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు సీపీ డాక్టర్ తరుణ్‌జోషి శుక్రవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.
కేరళ రాష్ట్రం కొచ్చి జిల్లా ఎర్రాకులానికి చెందిన రేష్మి రవీంద్రన్ నాయర్, బిజ్జు మాధవన్‌లు భార్యాభర్తలు. వీరు ప్రస్తుతం ఢిల్లీలోని ద్వారాక ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ దంపతులు కేరళలో ఉన్నప్పుడు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో షేర్ మార్కెట్‌లో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని స్థానికులను మోసం చేశారు. బాధితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు కావడంతో దంపతులిద్దరూ ఢిల్లీకి మకాం మార్చారు. పీవీఆర్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరున బోగస్ సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నంతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో సంస్థ తరఫున ప్రతినిధులను నియమించారు.
పీవీఆర్ కన్సల్టెన్సీ పేరున ఆన్‌లైన్ షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే 4నుంచి 8శాతం కమీషన్ అందజేస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పారు. నమ్మకం కలిగేందుకు ముందుగా పెట్టుబడులకు భారీగా కమీషన్లు చెల్లించారు. నమ్మకం కుదిరిన ప్రజలు ఈ సంస్థలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఎక్కువ మొత్తంలో బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ అయిన వెంటనే వీరు డబ్బును డ్రా చేసుకుని ప్రజలను మోసం చేసేవారు.
హనుమకొండవాసి ఫిర్యాదుతో..
హనుమకొండకు చెందిన ఒక వ్యక్తి సదరు కంపెనీ ప్రతినిధి అంటూ చెప్పుకున్న గోగుల శ్రీనివాస్ ద్వారా కిలాడీ దంపతులతో ఆన్‌లైన్‌లో పరిచయమై సుమారు కోటి రూపాయలకుపైగా పెట్టుబడులు పెట్టాడు. కొద్ది రోజులు సక్రమంగానే కమీషన్ చెల్లించిన నిందితులు.. ఆ తరువాత కన్సల్టెన్సీను మూసివేయడంతోపాటు ఫోన్‌లో కూడా అందుబాటులో లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి దీనిని సీరియస్‌గా తీసుకుని సైబర్ క్రైంతో పాటు సుబేదారి పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి కిలాడీ దంపతులను అదుపులోని స్థానిక న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టి వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరలించినట్లు సీపీ వెల్లడించారు. తప్పించుకున్న మరో నిందితుడు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, నందిరాంనాయక్, సైబర్ క్రైం, సుబేదారి ఇన్‌స్పెక్టర్లు జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్ ఎస్‌ఐ పున్నం చందర్, సైబర్ క్రైం ఎస్‌ఐ నిహారిక, ఏఏఓ ప్రశాంత్, సల్మాన్‌పాషా,ఏఎస్‌ఐ సత్తయ్య, సైబర్ క్రైం కానిస్టేబుల్ కిషోర్, సుబేదారి కానిస్టేబుళ్లు కమల, రాములును పోలీస్ కమిషనర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment