నేటి నుంచి మూడు రోజులు పోలీసు కస్టడీకి
న్యాయవాది సమక్షంలో విచారణ
న్యాయమూర్తి ఆదేశాలు
ఘటన పాత్రధారులు, సూత్రధారులను తేల్చేందుకు పోలీసులు సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసిన కేసులో ప్రధాన నిందితుడు (ఎ1) వేముల సతీష్ కుమార్‌ను గురువారం నుంచి మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్‌మేజిస్ట్రేట్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో సతీష్ను అతని తరపు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించారు.
దీంతో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్ను గురువారం ఉదయం 10 గంటలకు కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్ను ప్రతి రోజూ ఉదయం 10 ఉంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని, విచారించనున్నారు. విచారణ అనంతరం రోజూ సాయంత్రం ఐదు గంటలకు తిరిగి సబ్ జైలులో అప్పగించాల్సి ఉంటుంది.
సీఎం జగన్‌ను హతమార్చేందుకే దాడి
మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 13వ తేదీన విజయవాడ సింగ్‌నగర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పదునైన కాంక్రీట్ రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీఎం జగన్‌కు ఎడమ కంటి పైభాగంలో బలమైన గాయమైంది. పక్కనే ఉన్న విజయవాడ సెంట్రల్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా బలమైన గాయమైంది. వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అదే ప్రాంతానికి చెందిన వేముల సతీష్‌కుమార్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో అతన్ని అరెస్ట్ చేసి ఈ నెల 18న న్యాయస్థానంలో హాజరుపర్చారు. సతీష్కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కొందరు టీడీపీ నాయకుల ప్రోద్బలంతో ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్‌ను హతమార్చేందుకే సతీష్ రాయితో దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
పాత్రధారులు, సూత్రధారుల గుర్తింపునకే..
కొందరు టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే సీఎం జగన్‌పై తాను ముందస్తుగా సేకరించిన కాంక్రీట్ రాయితో దాడి చేశానని పోలీసుల ప్రాధమిక విచారణలో నిందితుడు సతీష్ అంగీకరించినట్లు సమాచారం. దీని అధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవరో సరిగా తేలక పోవడంతో ఈ కేసు అసంపూర్తిగానే ఉంది.
కేసును మరింత సమగ్రంగా, లోతుగా దర్యాప్తు చేసి, వాస్తవాలను వెలికి తీయాల్సి ఉంది. మరికొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించాల్సి ఉంది. ఇవే విషయాలను పేర్కొంటూ నిందితుడిని ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం నిందితుడిని మూడు రోజులు పోలీస్ కస్టడికి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment