లక్నో: ఎలుకను చంపినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు 30 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మనోజ్ కుమార్ ఓ ఎలుకను చిత్ర హింసలు పెడుతూ ఉండగా.. జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ ఈ మొత్తం ఘటనను చిత్రీకరించి నిందితుడు మనోజ్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విచిత్రమైన ఘటన తెరపైకి వచ్చింది. ఎలుక పట్ల అతను క్రూరంగా వ్యవహరించాడని ఆరోపించారు.
శర్మ ఎలుకను కాపాడేందుకు ప్రయత్నించగా అది ఊపిరాడక చనిపోయిందని తెలిపాడు. కాగా మనోజ్‌పై జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం, జంతువులను చంపడం లేదా గాయపరచడం కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక, మీడియాలో విడుదలైన వీడియోలు, సంబంధిత వివిధ విభాగాల నిపుణుల అభిప్రాయాలతో సహా 30 పేజీల ఛార్జిషీట్‌ను పోలీసులు సిద్ధం చేశారు. పోలీసులు ఎలుక మృతదేహాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ)కి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. వాపు కారణంగా ఎలుక ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, లివర్ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని చార్జిషీట్‌లో స్పష్టం చేశారు. అంతే కాకుండా మైక్రోస్కోపిక్ పరీక్షలో కూడా ఊపిరాడక ఎలుక చనిపోయిందని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయగా స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అటవీ శాఖ చట్టం ప్రకారం... ఎలుకను చంపడం నేరంగా పరిగణించబడదని బుదౌన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినందున చర్యలు తీసుకోవాల్సి ఉందని డిఎఫ్‌ఓ తెలిపారు.
ఏ శిక్ష పడే అవకాశం ఉంది!
జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో రూ.10 నుంచి రూ.2000 వరకు జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, మనోజ్ తండ్రి మధుర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎలుకను, కాకిని చంపడం తప్పుకాదని, అవి హానికర జీవులని, అలాంటి కేసులో మా కుమారుడికి శిక్ష పడితే కోళ్లు, మేకలు, మేకలను చంపే వారందరిపైనా చర్యలు తీసుకోవాలి. చేపలు, ఎలుకలను చంపే మందులను విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment