
శివమొగ్గలో దారుణ హత్యకు గురైన బజరంగ్ దళ్ కార్యకర్త ఉదంతం కార్చిచ్చును రగిల్చింది.
Shivamogga Tensions: బజరంగ్ దళ్ కార్యకర్త హత్యోదంతం కన్నడ నాట కార్చిచ్చు రగిల్చింది. హర్ష అనే 26 ఏళ్ల వ్యక్తిని గత రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనతో శివమొగ్గలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సాక్షి, బెంగళూరు: బజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు నిరసనగా సోమవారం సీగేహట్టిలో వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. టియర్ గ్యాస్ ప్రదర్శించి.. నిరసనకారులను చెదరగొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రెండురోజులపాటు విద్యా సంస్థల బంద్ ప్రకటించడంతో పాటు జనాలు గుమిగూడడంపై ఆంక్షలు విధించారు. అయినప్పటికీ.. బజరంగ్ దళ్ మద్దతుదారులు హర్ష మృతదేహాంతో భారీగా ర్యాలీ తీస్తూ ఇంటికి తీసుకెళ్లారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ నెలకొంది.
‘హిజాబ్’తో సంబంధం లేదు!
ఇదిలా ఉండగా.. హిజాబ్ వివాదం వల్లే ఈ హత్య జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుండడం కలకలం రేపింది. దీనిని ఖండిస్తూ రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. ఈ హత్యకు కారణం వేరే ఉంది. పోలీసులు కేసును చేధించే పనిలో ఉన్నారు. శివమొగ్గ సమస్యాత్మక ప్రాంతం. కాబట్టి, ఇలాంటి పుకార్లను ప్రసారం చేయకండని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. ఘటనపై స్పందించారు. పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించాయని, దర్యాప్తు వేగంగా జరుగుతోందని, నిందితులను అతిత్వరలో పట్టుకుంటామని ప్రకటించారు.
ఇక పాత కక్షలతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోందన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు.. హిజాబ్ వ్యవహారం కారణం కాదని స్పష్టం చేశారు. మరోవైపు బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ రఘు మాట్లాడుతూ.. పోలీస్ చర్యలపై తాము సంతృప్తిగా లేవని, హర్ష క్రియాశీలక సభ్యుడని, తమ కార్యాచరణ ఏంటో త్వరలోనే ప్రకటిస్తామన్నాడు.
రాజకీయ విమర్శలు
కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప.. హర్ష హత్యకు కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కారణమంటూ ఆరోపించారు. ‘హిజాబ్ నిరసనల ద్వారా రెచ్చగొట్టే వ్యవహారంతో ఈ హత్యకు శివకుమార్ కారణమయ్యారు’ అంటూ వ్యాఖ్యలు చేశాడు ఈశ్వరప్ప. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేపాడు ఈశ్వరప్ప.
ఇక ఈశ్వరప్ప కామెంట్లను శివకుమార్ ఖండించారు. ఈశ్వరప్పను మతిస్థిమితం లేని వ్యక్తిగా పేర్కొంటూ.. ఆయన(ఈశ్వరప్ప) నాలికకు, బుర్రకు సంబంధమే ఉండదని సిద్ధరామయ్య(ప్రతిపక్ష నేత) తరచూ చెప్తుంటారని, ఈశ్వరప్పను తొలగించాల్సిందేన’ని శివకుమార్ బీజేపీను డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని, హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని సిద్ధరామయ్య డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి.. కాంగ్రెస్, బీజేపీలే ఈ ఘటనకు కారణమని, హిజాబ్ వ్యవహారం మొదలైనప్పుడే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఊహించానని విమర్శలు గుప్పించారు.
శివమొగ్గలోని భారతి కాలనీ రవిశర్మ వీధిలో ఆదివారం రాత్రి హర్షను దుండగులు పొడిచి దారుణంగా హత్య చేశారు. కారులో వచ్చిన దుండుగులు హర్షను వెంబడించి పదునైన ఆయుధాలతో పొడిచి పరారయ్యారు. ఆపై ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
కమల్ హాసన్ స్పందన
ఇదిలా ఉంటే.. శివమొగ్గ బజరంగ్ దళ్ కార్యకర్త హత్యోదంతంపై నటుడు, మక్కల్ నీది మయ్యయ్ చీఫ్ కమల్ హాసన్ స్పందించారు. ‘ఈ తరహా రాజకీయాలకు నేను వ్యతిరేకంగా. జనవరి 30, 1948న ఒక్క హత్యతో దీనిని ప్రారంభించారు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది’’ అంటూ కమల్ గాంధీ హత్యను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.