
అగర్తలా: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ‍్యక్తిని(46) కొంత మంది మహిళలు చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు. సదరు వ్యక్తి ఓ హత్య కేసులో ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలవడం గమనార్హం.
వివరాల ప్రకారం.. త్రిపురలోని ధలై జిల్లాలోని గండెచెర్ర పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం ఓ మతపరమైన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భారీగా మహిళలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలికను పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచార ప్రయత్నం చేశాడు. దీంతో బాలిక కేకలు వేయగా.. నిందితుడి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు బాలికను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం సదరు బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గండెచెర్ర-అమర్‌పూర్ హైవేపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఈ క్రమంలోనే నిందితుడిని కొందరు వ్యక్తులు పట్టుకున్నారన్న విషయం తెలియడంతో అక్కడికి పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకున్నారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి మహిళందరూ తీవ్రంగా కొట్టారు. దీంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో హుటాహుటిన ఘటన స‍్థలానికి చేరుకున్నారు. అనంతరం నిందితుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment