కోలా వెంకటహేమంత్, సుబ్బలక్ష్మి
సాక్షి, విశాఖటపట్నం, పీఎం పాలెం(భీమిలి): టీడీపీ నేత, రియల్టర్ పాసి రామకృష్ణను ఇటీవల కిడ్నాప్ చేసిన ముఠాను పీఎం పాలెం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు కోలా వెంకట హేమంత్‌తో పాటు ఓ మహిళ, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఈ కేసు వివరాలను నగర డీసీపీ సునీల్ సుమిత్ గరుడ పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
భీమిలి మండలం గొల్లల తాళ్లవలసకు చెందిన కోలా వెంకట హేమంత్ రౌడీషీటర్‌గా పోలీస్ స్టేషన్‌లో రికార్డులకెక్కాడు. మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు కూడా. దొంగతనం, కొట్లాట వంటి ఐదారు నేరాలపై ఈయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. జైలులో శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. ఈయనకు విశాలాక్షినగర్‌లో ఉంటున్న సుబ్బలక్ష్మి(48) అనే ప్రియురాలు ఉంది. హేమంత్‌కు ఆమె అన్ని విధాలా సహకరిస్తుంటుంది.
కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు బయటకు చెప్పుకుంటారు. సుమారు రూ.35 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఆ అప్పుల నుంచి బయట పడాలంటే పెద్ద మొత్తంలో డబ్బు రాబట్టడానికి కిడ్నాప్ ఒకటే మార్గమని హేమంత్ పథకం రచించాడు. ఇందు కోసం భీమిలి మండలం జేవీ అగ్రహారానికి చెందిన రియల్టర్, టీడీపీ నేత పాసి రామకృష్ణను పావుగా ఎంచుకున్నాడు. తాను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని ఆయనను పరిచయం చేసుకుని సుమారు 20 రోజుల పాటు చాలా నమ్మకంగా వ్యవహరించాడు.
చదవండి: (Chandrababu: ఒప్పందాలంటూ అమెరికన్లతో ఫొటోలు.. 20 సంస్థల్లో ఒక్కటొస్తే ఒట్టు)
ఈ క్రమంలో ఓ స్థలం డెవలప్‌మెంట్‌కు సంబంధించి డీల్ కుదుర్చుకోవడానికి ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం రుషికొండ ఏరియాలోని ఎంబీకే గెస్ట్‌హౌస్‌కు రప్పించాడు. అప్పటికే పీఎం పాలెం ఆర్‌హెచ్ కాలనీకి చెందిన రౌడీషీటర్ మున్నా(27)తో పాటు మరో ఇద్దరు రౌడీషీటర్లు పెంటకోట కిరణ్(19), అంబటి మధుసూదన్‌రావు(31), కొలగాని రాజ్‌కుమార్‌లను తనకు సహాయంగా గెస్ట్‌హౌస్‌లో అందుబాటులో ఉంచాడు. హేమంత్ మాటలు నమ్మి వచ్చిన పాసి రామకృష్ణను తాళ్లతో బంధించి నోటికి ప్లాస్టర్ అంటించారు. వారంతా కలిసి ఆయనను అప్పటికే అద్దెకు తీసుకున్న కారులోకి బలవంతంగా ఎక్కించారు. కోటి రూపాయలు ఇస్తేనే విడిచి పెడతామని కత్తులతో బెదిరించి విజయనగరం వైపు తీసుకుపోయారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కత్తులు
సీసీ కెమెరాతో అడ్డం తిరిగిన కథ
ఈ కిడ్నాప్ తతంగం అంతా సీసీ కెమోరాలలో కనిపించడంతో గెస్ట్‌హౌస్ సిబ్బంది పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీలో కారు నంబర్‌ను గుర్తించారు. కారు యజమానికి ఫోన్ చేసి, డ్రైవర్ ఫోన్ నంబరు సంపాదించారు. ఆ నంబర్‌కు ఫోన్ చేయడంతో.. కిడ్నాప్ విషయం పోలీసులకు తెలిసిపోయిందని గ్రహించి కారులో ఉన్నవారందరూ తలో దిక్కుకూ పారిపోయారు. అదే సమయంలో కట్లు విడిపించుకుని బాధితుడు రామకృష్ణ కారులోంచి దూకి తప్పించుకున్నాడు. ఏదోలా భీమిలి చేరుకుని పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు.
చదవండి: (ఆపసోపాలు.. పడరాని పాట్లు.. నవ్వులపాలైన టీడీపీ)
తప్పు మీద తప్పు చేసిన కిడ్నాపర్
కిడ్నాప్ పథకం బెడిసికొట్టడంతో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కిడ్నాపర్ వెంకటహేమంత్ తప్పుల మీద తప్పులు చేశాడు. పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. గంట్యాడ పోలీసులను అప్రమత్తం చేయగా కారుకు అడ్డంగా స్టాపర్లు పెట్టగా వాటిని గుద్దుకుంటా ఉడాయించాడు. ఎస్.కోట పోలీసులు అడ్డుకోగా వారి నుంచి కూడా దౌర్జన్యంగా తప్పించుకున్నాడు. ఈ రెండు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
ప్రియురాలి చెంత చేరి.. పోలీసులకు చిక్కి..
పోలీసుల నుంచి తప్పించుకున్న వెంకట హేమంత్ తన నిత్య స్థావరమైన విశాలాక్షినగర్‌లో నివసిస్తున్న సిరంగి సుబ్బలక్ష్మి ఇంట్లో తల దాచుకున్నాడు. గతంలో పలుమార్లు నేరాలకు పాల్పడినప్పుడు ఇలాగే చేసేవాడు. పోలీసులు ఈ కేసు ఛేదనలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించి, ఆమెతో పాటు హేమంత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా నలుగురు నిందితులను మధురవాడ ఐటీ సెజ్ సమీపంలో అరెస్ట్ చేశారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన సీఐ రవికుమార్, సిబ్బందిని డీసీపీ ఈ సందర్భంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment