రెడ్ మిక్సర్ బంగారం పేరిట మోసానికి పాల్పడింది ఈ వస్తువులతోనే , నిందితులను మీడియాకు చూపుతూ, మోసం జరిగిన తీరును వివరిస్తున్న డీఎస్పీ భీమారావు, సీఐ గోవిందరాజు
సాక్షి, కాకినాడ: సాధారణ బంగారం కంటే విలువైన బంగారం తమ వద్ద ఉందని నమ్మించి ఒక వ్యక్తిని మోసం చేసిన ముఠా గుట్టును సర్పవరం పోలీసులు రట్టు చేశారు. సర్పవరం పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాకినాడ డీఏస్పీ భీమారావు, సీఐ గోవిందరాజు ఈ వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాధితుడు ఆడారి నాగులుకు ఫోన్ ద్వారా కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. బంగారం కంటే ఎక్కువ విలువైన రెడ్‌మిక్సర్ బంగారం తమ వద్ద ఉందని, దీని విలువ రూ.10 లక్షలు ఉంటుందని నమ్మించారు. తమకు డబ్బులు అర్జెంట్‌గా అవసరమవడంతో రెడ్‌మిక్సర్ బంగారాన్ని రూ.4 లక్షలకే ఇచ్చేస్తామని చెప్పారు. ఆ మాటలు నమ్మిన నాగులు ఆగస్టు 23న సర్పవరం పూల మార్కెట్ వద్ద ఆ వ్యక్తులకు నగదు అందజేశాడు. అనంతరం వారు రెడ్‌మిక్సర్ బంగారం ఇవ్వలేదంటూ 27వ తేదీన సర్పవరం పోలీసు స్టేషన్‌లో అతడు ఫిర్యాదు చేశారు.
దీనిపై ఎస్సై కృష్ణబాబు కేసు నమోదు చేశారు. సీఐ గోవిందరాజు తన సిబ్బందితో కలిసి ఈ కేసు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ముందుగా అందిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి 7 సమయంలో అచ్చంపేట జంక్షన్ వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సామర్లకోట మండలం అయోధ్యరామపురానికి చెందిన గున్నాబత్తుల శివ, అచ్చంపేట గ్రామానికి చెందిన వీరంరెడ్డి వీర వెంకట రమణ, సామర్లకోట పట్టణానికి చెందిన రొంగల శేషుకుమార్, పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన మోటుపల్లి శివనారాయణ, పెద్దాపురానికి చెందిన కలగా హరీష్ ఉన్నారు. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి రూ.1.65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంతో సీఐ గోవిందరాజు, ఎస్సై కృష్ణబాబు, ఏఎస్సై నాగేశ్వరరావు, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, రూప్‌కుమార్, సతీష్‌కుమార్ సహకరించారని పేర్కొంటూ డీఎస్పీ భీమారావు వారికి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment