సాక్షి హైదరాబాద్: అద్దెకు ఉంటామనే నెపంతో ఇంట్లోకి దూరి మహిళల మెడలోని బంగారు నగలతో ఉడాయిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నగల రికవరీ నిమిత్తం ప్రధాన సూత్రధారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. రూ.40 వేల నకిలీ కరెన్సీ దొరకడంతో పోలీసులకు అనుమానమొచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు రాచకొండ పోలీసులు చెక్ పెట్టారు. మొత్తం 11 మంది గ్యాంగ్‌లో 9 మందిని అరెస్ట్ చేశారు. గురువారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు.
అక్కడ దొరికి.. నగరానికి వచ్చి..
తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన కొవ్వూరు శ్రీనివాస్ రెడ్డి గతంలో దొంగనోట్లు ముద్రించి అనపర్తి, రాజమండ్రిలలో చెలామణి చేసేవాడు. అదే గ్రామానికి చెందిన ఓగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి.. దొంగ నోట్లు ఎలా తయారు చేయాలో శ్రీనివాస్ రెడ్డి వద్ద నేర్చుకున్నాడు. స్థానికంగా నకిలీ కరెన్సీ నోట్ల వినియోగిస్తూ ప్రజలను మోసం చేసేవాడు. ఈ కేసులో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చాక ఏపీలో ఉంటే మళ్లీ పట్టుబడతామని గ్రహించి.. తన స్నేహితులైన అనపర్తికి చెందిన కోడూరి శివ గణేష్, శ్రీకాంత్ రెడ్డి, కర్రి నాగేంద్ర సుధామాధవ రెడ్డి, సోరంపూడి శ్రీనివాస్, పిల్లి రామకృష్ణ, పేరం వెంకట శేషయ్య, నాగిరెడ్డి, మస్తాన్‌లతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
రూ.50 వేలు ఇస్తే రూ.లక్ష..
- మియాపూర్ కల్వరీ టెంపుల్ సమీపంలోని శిల్పా అవెన్యూ కాలనీకి చెందిన తోట సంతోష్ కుమార్ ఇంట్లో దొంగనోట్లు ముద్రించడం మొదలుపెట్టారు. నాగిరెడ్డి, మస్తాన్, శివ గణేష్‌లు నకిలీ రూ.100, 200, 500 దొంగ నోట్ల తయారీదారులు కాగా.. శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుధామాధవ రెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణలు మధ్యవర్తులు. వీరు రూ.50 వేల అసలు నగదు ఇచ్చే వినియోగదారులకు రూ.లక్ష నకిలీ కరెన్సీని ఇస్తుంటారు. ఇందుకు గాను మధ్యవర్తులకు రూ.15వేలు కమీషన్ ఇస్తారు. రూ.35 వేలు తయారీదారులు తీసుకుంటారు.
- విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు గురువారం ఉదయం మార్కెట్‌లో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. నాగిరెడ్డి, మస్తాన్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.3.22 లక్షల నకిలీ కరెన్సీ, రెండు కలర్ జిరాక్స్ ప్రింటర్లు, వాటర్ మార్క్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
జైలులో ఒక్కటయ్యారు..
గతంలో గంజాయి కేసులో సంతోష్ కుమార్ అరెస్ట్ కాగా.. మానవ అక్రమ రవాణా కేసులో పేరం వెంకట శేషయ్య అరెస్ట్ అయ్యాడు. వీళ్లిద్దరికి చర్లపల్లి జైలులో పరిచయం ఏర్పడింది. బెయిల్‌పై బయటికి వచ్చాక దొంగనోట్ల కేసులో ప్రధాన సూత్రధారి అనపర్తికి చెందిన ఓగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డితో జట్టుకట్టారు. మియాపూర్‌లోని సంతోష్ ఇంట్లో దొంగనోట్లు ముద్రించి స్థానికంగా చెలామణి చేయడం మొదలుపెట్టారు
Comments
Please login to add a commentAdd a comment