సాక్షి, క్రైమ్: శంషాబాద్ పరిధిలో నర్కుడ వద్ద జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు చేధించారు. పక్కా క్రిమినల్ ఆలోచనతోనే అప్సర(30)ను పూజారి సాయికృష్ణ(36) చంపాడని పోలీసులు వెల్లడించారు. అప్సరను గాఢంగా ప్రేమించానని చెప్పుకుని తిరిగిన సాయికృష్ణ ఎందుకు చంపాల్సి వచ్చింది?, చంపి ఆపై సాక్ష్యాలను మాయం చేసేందుకు ఏం చేశాడనే వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.
నిందితుడు సాయికృష్ణ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న గుడిలో సాయికృష్ణ పెద్దపూజారి. ఆ దగ్గర్లోనే శ్రీ వెంకటేశ్వరకాలనీలో అతను ఉంటున్నాడు. ఇక ఈ గుడి పక్కనే ఉండే ఇంటిలో అప్సర ఉంటోంది. గుడికి వచ్చే క్రమంలో అప్సరతో సాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. శంషాబాద్ గోశాలకు ఇద్దరూ కలిసి వెళ్లేవారు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
నిందితుడు సాయికృష్ణకు ఇదివరకే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అప్సర సాయికృష్ణను ఇష్టపడింది. గతంలో అప్సర గర్భం దాల్చడంతో.. అబార్షన్ చేయించినట్లు సాయికృష్ణ చెప్పాడు. ఇతరులతో చనువుగా ఉండడం, పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడని ఇప్పుడు అంటున్నాడు.
శంషాబాద్ సీఐ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీన తన అక్క కూతురు కనిపించకుండాపోయిందని సాయికృష్ణ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే.. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఈ కేసును ఛేదించాం. జూన్ 3వ తేదీన నర్కుడ దగ్గర్లో చంపేశాడు. ఆపై మృతదేహాన్ని ఓ కవర్‌లో చుట్టి కారులో వేసుకుని.. సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వెనకాల ఉన్న డ్రైనేజీలో పడేశాడు. ఈ విషయం అప్సర కుటుంబ సభ్యులెవరికీ తెలియదు. అప్సర మిస్సింగ్ కేసులో అనుమానం రావడంతోనే సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నాం. విచారణలో.. నిజం ఒప్పుకున్నాడు.
రెండోసారి గర్భం?
సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్ లో నుండి అప్సర మృతదేహన్ని పోలీసులు శుక్రవారంనాడు వెలికితీశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె రెండోసారి గర్భం దాల్చిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇతరులతో చనువుగా ఉన్న అప్సర.. వాళ్ల ద్వారా గర్భం దాల్చి ఉంటుందని సాయికృష్ణ అనుమానించి ఉంటాడని, దీనికి తోడు ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే.. ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉంది.
సాయికృష్ణ అలా చెప్పాడు: అప్సర తల్లి
పూజారి ఘాతుకంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పూజారి అయ్యి ఉండి ఇలా చేస్తాడని ఊహించలేదని అప్సర తల్లి వాపోతోంది. అప్సర గతంలో తమిళ చిత్రంలో నటించింది. అయితే ఆవైపు వద్దని చెప్పి చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చేశాం. ఆ తర్వాత గుడిలో అప్సర-సాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ తరచూ మా ఇంటికి వస్తుండేవాడు. మా అమ్మాయితో సాయికృష్ణకు ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు. అయితే.. జూన్ 3వ తేదీన మా అమ్మాయి కోయంబత్తూరు వెళ్తున్నట్లుగా చెప్పి వెళ్లింది. సాయి తనను శంషాబాద్‌లో దించుతాడని చెప్పింది. కానీ, మరుసటి రోజున మా అమ్మాయి నుంచి ఎలాంటి సమాచారం లేదు.
సాయి కృష్ణని అడిగితే.. తన స్నేహితులతో అప్సర భద్రాచలం వెళ్లిందని చెప్పాడు. అంబేద్కర్ స్టాచ్యూ వద్ద దించానని అన్నాడు. కానీ, ఆమె భద్రాచలం వెళ్లిన ఆనవాలు లభించలేదు. మా అమ్మాయిని ఎవరితో భద్రాచలం పంపావని నిలదీశాను. కానీ, అతని దగ్గరి నుంచి బదులు రాలేదు. సాయికృష్ణని పోలీసులు గట్టిగా నిలదీస్తే.. అప్పుడు అప్సరను చంపానని చెప్పాడు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే అప్సరను చంపానని సాయి కృష్ణ అంటున్నాడు. అందులో వాస్తవం ఉండకపోవచ్చు. సాయికృష్ణకు ఉరి శిక్ష పడాల్సిందే అని అప్సర తల్లి డిమాండ్ చేస్తోంది.
అప్సర మంచిది
ఈ ఏరియాలోనే సాయికృష్ణ పెద్ద పూజారి. అప్సరతో అతనికి మంచి స్నేహం ఉంది. సాయికృష్ణ రాత్రి 11 గంటల వరకు అప్సర ఇంట్లోనే ఉండేవాడు. ఒక్కోసారి ఇద్దరూ కలిసి రాత్రి 12 తర్వాత కూడా బైక్ మీద బయటకు వెళ్లేవాళ్లు. కానీ, అప్సర చాలా మంచిది. పూజారి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నాం అని అప్సర ఉంటున్న ఇంటి యజమాని చెప్తున్నాడు.
వెలుగులోకి కీలక విషయాలు
కోయంబత్తూరు వెళ్తున్నానని, సాయికృష్ణ తనను డ్రాప్ చేస్తాడని తల్లికి చెప్పి ఇంట్లో చెప్పి బయల్దేరింది అప్సర. ఇద్దరూ కలిసి ఫోర్డ్ కారులో శంషాబాద్ రాళ్ల గూడ వైపు వెళ్లారు. అక్కడ భోజనం చేశారు. ఆపై కారులో ఫ్రంట్ సీట్‌లో రిలాక్స్ మోడ్‌లో పడుకుంది అప్సర. ఇదే అదనుగా హత్య కోసమే తెచ్చిన బెల్లం దంచే దుడ్డుకర్రను బయటకు తీశాడు సాయికృష్ణ. ఆ కర్రతోనే ఆమె తలపై బాది చంపేశాడు. ఆపై కవర్‌లో ఆమె డెడ్‌బాడీని ఉంచి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కారు రోజంతా ఇంటి ముందే పార్క్ చేశాడు. ఆ మరుసటి రోజు మ్యాన్‌హోల్‌లో అప్సర మృతదేహాన్ని పడేసి.. పైన మట్టి కప్పి వెళ్లిపోయాడు. హత్యకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment