సాక్షి, జగిత్యాల: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోరుట్ల టెక్కీ దీప్తి మర్డర్ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారం వల్లే.. దీప్తిని ఆమె సోదరి చందనే హత్య చేసినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ప్రాథమిక విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తుండగా.. సాయంత్రం పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
తన ప్రియుడితో వెళ్లిపోయే క్రమంలో.. దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి, చున్నీ చుట్టి వెళ్లిపోయినట్టు చందన ఒప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. కోరుట్ల దీప్తి కేసులో.. సోదరి చందన, ఆమె ప్రియుడు, ప్రియుడి తల్లి, అతని తరపు మరో బంధువు, కారు డ్రైవర్ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
నాలుగు బృందాలుగా విడిపోయి..
కోరుట్లలోని భీమునిదుబ్బకు చెందిన బంక దీప్తి ఆగస్టు 29వ తేదీన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే రాత్రి ఆమె చెల్లెలు చందన అదృశ్యమైంది. ఓ యువకుడితో కలిసి బస్టాండ్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. ఈలోపు ఇంట్లో మందు బాటిల్స్ దొరకడం, బస్టాండ్ సీసీటీవీ ఫుటేజీలో ఉంది చందన కాదని నిర్ధారణ కావడం, సోదరిని తాను చంపలేదని చందన సోదరుడికి వాయిస్ మెసేజ్ పంపడం.. చందన ఆచూకీ విషయంలో రకరకాల ప్రచారం కేసును మరింత గందరగోళంగా మార్చేశాయి. దీంతో.. చందన దొరికితేనే ఈ కేసు మిస్టరీ వీడుతుందని పోలీసులు భావించారు.
అయినప్పటికీ.. పోలీసులు మాత్రం దీప్తి కేసు దర్యాప్తులో ట్రాక్ తప్పలేదు. దీప్తి తండ్రి శ్రీనివాసరెడ్డి తన చిన్న కూతురు చందనతో పాటు ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా కేసును దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో మూడు, నాలుగు బృందాలుగా విడిపోయి దీప్తి సోదరి చందన జాడ కోసం వెతికారు. ఈ క్రమంలో.. ఒంగోలు వైపు వెళ్తున్నట్లు సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
టంగుటూరులోని టోల్‌గేట్‌ను తప్పించుకుని ఆలకూరపాడు వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాలతో.. తనిఖీలు చేపట్టగా.. ఒంగోలులోని ఓ లాడ్జిలో వాళ్లను పట్టుకుని జగిత్యాల పోలీసులకు అప్పగించారు. నిందితులను జగిత్యాలకు తీసుకువచ్చి పోలీసులు విచారించారు.
ప్రేమకు నిరాకరణ.. దీప్తితో గొడవ
చందన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చేసింది. ఆ సమయంలో ఓ సీనియర్‌తో ఆమె ప్రేమలో పడింది. అయితే ఇద్దరి మతాలు వేరు. అందుకే వాళ్ల ప్రేమ-పెళ్లికి చందన తల్లిదండ్రులు, అక్క దీప్తి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఊరికి వెళ్లిన టైంలో.. దీప్తితో చందన గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆపై ముక్కూ, మూతికి ప్లాస్టర్ వేసిందని, ఊపిరి ఆడక దీప్తి మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ప్రస్తుతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో చందన, ఆమెతో ఉన్న ముగ్గురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. ఆపై డీఎస్సీ భాస్కర్ ఈ కేసుకు సంబంధించి నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి.. పూర్తి వివరాలు సాయంత్రం మీడియాకు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment