కరీంనగర్: ఇంట్లో నగలు, నగదు ఉన్న సమయంలోనే ప్రియుడితో కలిసి పరార్ కావాలన్న ఆలోచన చందనకు ఎవరు కల్పించారు? ఈ దిశలో ఆమెను ఎవరైనా గైడ్ చేశారా? ప్రేమ మోజులో ఆ యువతి వారి ట్రాప్‌లో పడిపోయిందా? ప్రియుడితో కలిసి వెళ్లకుండా అడ్డుకున్న అక్కను చివరకు హతమార్చే పరిస్థితికి దిగజారిందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతనెల 29 వేకువజామున పట్టణంలోని భీమునిదుబ్బలో ప్రియుడు ఉమర్ షేక్‌తో కలిసి చందన తన అక్క దీప్తిని సినీఫక్కీలో హత్యచేసిన కేసులో వెలుగులోకి వస్తున్న కోణాలు ఆసక్తి రేపుతున్నాయి.
నాలుగేళ్ల పరిచయం..
► 2019లో చందన బీటెక్ చదవడం కోసం హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో చేరింది.
► తన కంటే ఒక ఏడాది సీనియర్ ఉమర్ షేక్ సుల్తాన్ డిటెయిన్ కావడంతో చందనకు పరిచయం అయ్యాడు.
► అప్పటినుంచి వీరి ప్రేమాయణం సాగుతున్నట్లు సమాచారం.
► హాస్టల్‌లో ఉంటూ చందన తరచూ ఉమర్ షేక్ సుల్తానా ఇంటికి వెళ్లివస్తుండేదని తెలిసింది.
► ఈక్రమంలో వీరి ప్రేమ వ్యవహారం కొన్నాళ్లకు దీప్తికి తెలిసింది.
► ఆ తర్వాత ఇంట్లోనూ అందరికీ తెలిసి గొడవలు జరిగినట్లు సమాచారం.
► దీంతో చందన తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లు దీప్తి, చందనకు వివాహాలు చేయాలని సన్నాహాలు ప్రారంభింంచారు.
► ఆయన ఆంధ్రాకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడే సంబంధాలు చూస్తున్నారు.
► పెళ్లి చేసుకోవాలని ఇంట్లో పెరుగుతున్న ఒత్తిడి గురించి చందన తన ప్రియుడికి చెప్పినట్లు సమాచారం.
► అయితే, ‘మనకు జాబ్ లేదు.. ఎలాబతుకుతాం’ అని డబ్బు, నగలు తీసుకొచ్చేలా ఉమర్ షేక్.. చందన దృష్టి మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రేమా..
గతనెల 28వ తేదీన ఉదయం హైదరాబాద్ నుంచి కోరుట్లకు బయలుదేరిన విషయాన్ని ఉమర్ షేక్ తన తల్లి ఆలియా, చెల్లె ఫాతిమాకు చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే, ఆ యువకుడు, అతడి కుటుంబానికి చందనపై కేవలం ప్రేమ మాత్రమే ఉండి ఉంటే నగలు, డబ్బు అవసరం లేదని చెప్పి ఉండవచ్చు కదా? అనే సందేహాలు వేధిస్తున్నాయి. సోమవారం రాత్రి దీప్తి మద్యం మత్తులో ఉన్న సమయంలో చందన, ఉమర్ కలిసి నగలు, డబ్బు సర్దే పనిచేయకుండా చడీచప్పుడు కాకుండా పరారై ఉంటే.. దీప్తి హత్యకు ఆస్కారం ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమర్ షేక్ తల్లి గతంలో లెక్చరర్‌గా పనిచేసినట్లు సమాచారం. విద్యాధికులైన ఉమర్ షేక్ కుటుంబీకులు.. చందన, ఉమర్ కలిసి మంగళవారం నగలు, డబ్బులతో కారులో హైదరాబాద్ చేరుకోగానే.. ఇది తప్పని చెప్పి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాకుండా అంతాకలిసి నగలు, డబ్బులతో తప్పించుకునే ప్రయత్నం చేయడం.. చందనను గుర్తుపట్టకుండా బుర్కా వేసి కారులో తీసుకెళ్లడం.. టోల్‌గేట్లకు చిక్కకుండా అడ్డదారుల్లో పయనించడం.. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందన్న అభిప్రాయాలకు ఊతమిస్తోంది.
రిమాండ్‌కు నిందితులు..
దీప్తి హత్య, డబ్బులు, నగలు ఎత్తుకెళ్లిన కేసులో నిందితులు బంక చందన, ఆమె ప్రియుడు ఉమర్‌షేక్ సుల్తానా, ఇతడి తల్లి ఆలియా, చెల్లి ఫాతిమాతోపాటు బంధువు హఫీజ్‌ను ఆదివారం మధ్యాహ్నం జడ్జి వద్ద పోలీసులు హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నిందితులపై ఐపీసీ 302, 201, 120(బీ),380 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment