పక్కా పథకం ప్రకారమే అలజడులకు కుట్ర  | TDP Involvement Behind Damage Of Idols In Temples | Sakshi
Sakshi News home page

పక్కా పథకం ప్రకారమే అలజడులకు కుట్ర 

Published Fri, Jan 15 2021 7:13 AM | Last Updated on Fri, Jan 15 2021 10:35 AM

TDP Involvement Behind Damage Of Idols In Temples - Sakshi

సాక్షి, అమరావతి: ఆలయాల్లో అకృత్యాలకు పాల్పడి అలజడులు రేపేందుకు తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర బట్టబయలవుతోంది. రాష్ట్రంలో వరుసగా జరిగిన దేవాలయాల్లోని విగ్రహాల ధ్వంసం ఘటనలను నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయంగా తెల్సింది. ఈ నెలలోనే జరిగిన ఐదు ఘటనలను, పోలీసులు నమోదు చేసిన కేసులను నిశితంగా పరిశీలించిన నిఘా వర్గాలు ఇప్పటికి మూడింటిలో టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉండటాన్ని గుర్తించాయి. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం. చదవండి: ఎన్నిసార్లు మారతారు బాబు గారూ?

జనసంచారం లేని చోట 
మారుమూల జన సంచారం లేనిచోట ప్రైవేటు లేదా టీడీపీ నేతల అజమాయిషీలో ఉన్న చిన్నపాటి ఆలయాన్ని ఎంచుకుని విగ్రహాలు ధ్వంసం చేయడం, మరునాడే టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని గగ్గోలు పెట్టడం, సొంత మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విషం కక్కడం.. ఇదీ టీడీపీ వేసిన స్కెచ్‌ ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ఇదే విషయం నిఘా వర్గాల పరిశీలనలోనూ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు విశాఖపట్నం రూరల్, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో జరిగిన మూడు ఆలయాల విషయంలో ఆలజడులు రేపేందుకు టీడీపీ శ్రేణులు, వారి అనుకూల మీడియా చేసిన ప్రయత్నాలను పసిగట్టిన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను నిఘా వర్గాలు తమ నివేదికలో పొందుపరిచాయి.  గతేడాది డిసెంబర్‌ 28న జరిగిన రామతీర్థం శ్రీరాముడి విగ్రహ ధ్వంసంలోనూ టీడీపీ నేతల హస్తంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారించిన 21 మందిలో టీడీపీ శ్రేణులు కూడా ఉండటం గమనార్హం. చదవండి: తిరుమలలో అవినీతి రహిత పాలన

టీడీపీ నేతలు, రిపోర్టర్లపై కేసులు, అరెస్టులు
కర్నూలు జిల్లా కొసిగి మండలం సజ్జలగూడెంలో ఆంజనేయస్వామి ఆలయ టవర్‌(ఆర్చి)పై సీతారాముని విగ్రహం కాళ్లను ధ్వంసం చేసి హుండీని దొంగిలించిన ఘటనపై ఈ నెల 2న పోలీసులు కేసు నమోదు చేశారు. సజ్జలగూడెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు కురువ విశ్వనాథరెడ్డి ఈ ఆలయానికి చైర్మన్‌గా ఉన్నారు. ఆయనతో పాటు ఆలయ పూజారి శ్రీరాములు పథకం ప్రకారం దాన్ని వీడియో తీసి ఏబీఎన్‌ రిపోర్టర్‌ హనుమేష్, తెలుగు టీవీ రిపోర్టర్‌ హరిజన శ్రీరాములుకు పంపి దాన్ని టెలికాస్ట్‌ చేయించారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.

ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామం లక్ష్మీనరసింహాస్వామి ఆలయం ఆర్చిలోని విగ్రహాలు ఇటీవల కొంతమేర దెబ్బతిన్నాయి. దీనిపై ఈనెల 5న పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఆరుగురు టీడీపీకి చెందిన వారు కాగా.. మిగిలిన ఏడుగురు ఆ పార్టీ అనుకూల మీడియా రిపోర్టర్లు. టీడీపీకి చెందిన మద్దసామి, మౌలాలి, గాలి హరిబాబులతో పాటు మరో ఆరుగురు రిపోర్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగతావారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement