
దాడిలో గాయపడిన గురవయ్య
పుట్లూరు: పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయలేదని అనంతపురం జిల్లా తక్కళ్లపల్లిలో ఒక వ్యక్తిపై టీడీపీ కార్యకర్త బుధవారం హత్యాయత్నం చేశాడు. గత నెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తక్కళ్లపల్లి పంచాయతీలో టీడీపీ మద్దతుదారైన వార్డు అభ్యర్థికి ఓటు వేయలేదనే అక్కసుతో గురవయ్యపై ఆ పార్టీ కార్యకర్త సుధాకర్ రాళ్లతో దాడిచేశాడు.
తలకు తీవ్ర గాయాలు కావడంతో గురవయ్యను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని తాడిపత్రి రూరల్ సీఐ మల్లికార్జునగుప్తా పరిశీలించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.