అబార్షన్ చేయించిన భర్త... వైద్యం వికటించి భార్య మృతి
సూర్యాపేటటౌన్: పుట్టేది ఆడపిల్ల అని తెలిసి భార్యకు ఆర్‌ఎంపీతో భర్త అబార్షన్ చేయించగా, వైద్యం వికటించి ఆమె మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్‌తండాకు చెందిన రత్నావత్ హరిసింగ్‌కు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాముతండాకు చెందిన సుహాసిని(26)కి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. సుహాసిని మూడోసారి గర్భవతి కాగా, స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియడంతో హరిసింగ్ సుహాసినికి అబార్షన్ చేయించాలనుకున్నాడు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ సలహా తీసుకోగా.. ఏడో నెలలో అబార్షన్ చేయిస్తే తల్లీబిడ్డకు ప్రమాదం ఉంటుందని ఆమె చెప్పింది. అయినా, సుహాసినిని రెండురోజుల క్రితం బలవంతంగా హరిసింగ్ హుజూర్‌నగర్ ప్రాంతంలో ఓ ఆర్‌ఎంపీతో అబార్షన్ చేయించాడు. అయితే వైద్యం వికటించి సుహాసిని పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం కోదాడకు, ఆపై ఖమ్మంకు అక్కడ నుంచి సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా ఆమె మృతి చెందింది.
అయితే సుహాసిని మృతిచెందిన విషయాన్ని హరిసింగ్ కుటుంబసభ్యులకు చెప్పకుండా ఎంజీనగర్ తండాకు తీసుకొచ్చాడని, గ్రామస్తులు గమనించి విషయం తమకు తెలిపారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. సూర్యాపేటటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పంపించారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు.
పీహెచ్‌డీ చేసిన హరిసింగ్..
హరిసింగ్ నెలరోజుల క్రితమే ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడని, ఉన్నత చదువులు చదివిన వ్యక్తే బలవంతంగా అబార్షన్ చేయించి సుహాసిని మృతికి కారణమయ్యాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment